Business

జాక్‌మా…ఎటు పోయావమ్మా? – వాణిజ్యం

జాక్‌మా…ఎటు పోయావమ్మా? – వాణిజ్యం

* ప్రభుత్వానికి సలహాలివ్వబోయి కష్టాలు కొనితెచ్చుకున్న చైనా టెక్‌ బిలియనీర్‌, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా.. గత రెండు నెలలుగా బాహ్యప్రపంచానికి కన్పించట్లేదు. ప్రభుత్వంతో వివాదం నడుస్తున్న సమయంలో ఆయన అదృశ్యం కావడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది.

* నిస్సాన్‌ మాగ్నైట్‌ ఇండియా బుకింగ్స్‌లో అదరగొడుతోంది. ఈ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విడుదలైన తర్వాత నుంచి ఇప్పటి వరకు 32,000 బుకింగ్స్‌ సాధించిందని కంపెనీ తెలియజేసింది. ఈ కారు మార్కెట్లోకి వచ్చి ఇటీవలే నెలరోజులు దాటింది. నిస్సాన్‌ తయారు చేసిన తొలి మేడిన్‌ ఇండియా ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం. దీనికి భద్రత ప్రమాణాల పరీక్ష ఏషియన్‌ ఎన్‌సీఏపీలో 4స్టార్‌ రేటింగ్‌ లభించింది. ఈ పరీక్షకు కూడా మేడిన్‌ ఇండియా మోడల్‌ కారునే వినియోగంచడం విశేషం. నిస్సాన్‌ మోటార్‌ ఇండియా ఎండీ రాకేష్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘‘ మాగ్నైట్‌కు అపూర్వ ఆదరణ లభించింది. తొలి ఐదు రోజుల్లోనే 5వేల బుకింగ్స్‌, 15 రోజుల్లోనే 15వేల బుకింగ్స్‌ వచ్చాయి. ఇప్పటి వరకు 32,800 బుకింగ్స్‌ వచ్చాయి. ఇక ఈ కారు కోసం వచ్చిన ఎంక్వైరీలు 1.80లక్షలకు చేరాయి’’ అని తెలిపారు. ఈ కారుకు ఆన్‌లైన్‌లోనే 3,800 బుకింగ్స్ రావడం విశేషం.

* ప్రముఖ మీడియా సంస్థ జీ గ్రూప్‌ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ దాడులు జరిపినట్లు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. జీ గ్రూప్‌ సైతం సోదాలను ధ్రువీకరించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఐటీ శాఖ అధికారులు తమ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారని జీ గ్రూప్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ఐటీ అధికారులకు పూర్తి సహకారం అందిస్తూ వారు కోరిన వివరాలను అందజేసినట్లు తెలిపారు.

* దేశీయ మార్కెట్లు వరుసగా తొమ్మిదో రోజూ లాభాల్లో ముగిశాయి. కరోనాను అంతమొందించేందుకు ఉద్దేశించిన రెండు వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు మంజూరైన నేపథ్యంలో సూచీలు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లు సైతం సానుకూలంగా కదలాడడం కలిసొచ్చింది. దీంతో సూచీలు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ తొలిసారి 48వేల మార్కు దాటగా.. నిఫ్టీ 14,100పైన ముగిసింది.

* మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొంటున్న బ్యాంకులు ప్రజలకు తమ సేవలను మరింత చేరువచేయడంలో పోటీ పడుతున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా సర్వీసులను మరింత విస్తరించే దిశగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు వాట్సాప్‌ బ్యాంకింగ్ సేవలందిస్తుండగా.. తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడం, మినీ స్టేట్‌మెంట్‌, చెక్‌ స్టేటస్‌ ఎంక్వైరీ, చెక్‌బుక్‌ రిక్వెస్ట్‌, డెబిట్‌ కార్డు బ్లాకింగ్‌.. ఇలా తమ సర్వీసులకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్‌ ద్వారా ఖాతాదారులకు అందుబాటులో ఉంచుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.

* హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌ల కోసం తమ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) పథకాన్ని మార్చి 31 వరకు పొడిగించాయి. కరోనావైరస్ మహమ్మారి మధ్య, వడ్డీ రేట్లు వేగంగా పడిపోతున్నందున సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి మే 2020 లో ప్రత్యేక ఎఫ్‌డి పథకాన్ని ప్రవేశపెట్టాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి అగ్ర రుణదాతలు ఈ ఎఫ్‌డిలపై సీనియర్ సిటిజన్లకు వర్తించే ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డి) పై ఉన్న రేట్లపై అదనపు వడ్డీ రేట్లను అందిస్తున్నారు.