Food

గంజాయికి చట్టబద్ధత కల్పించనున్న మోడీ సర్కార్

గంజాయికి చట్టబద్ధత కల్పించనున్న మోడీ సర్కార్

ప్రపంచవ్యాప్తంగా నిషేధిత మాదక ద్రవ్యాలలో ఒకటైన గంజాయికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. గంజాయిపై నిషేధం విధించడం మూలంగా ఎక్కువగా నష్టపోతున్నది పేదలేనని, వారే జైళ్లలో మగ్గుతున్నారని కేంద్ర సామాజిక, సాధికారత మంత్రిత్వశాఖ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. మరోవైపు గంజాయికి చట్టబద్ధత కల్పించడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితికి ఊతం లభిస్తుందని, పన్నుల రూపంలో కోట్ల రూపాయలు ఖజానాకు చేరుతాయని అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన ‘యూఎన్‌ కమిషన్‌ ఆన్‌ నార్కొటిక్స్‌ డ్రగ్స్‌’ సభ్య దేశాల సమావేశంలో గంజాయిపై నిషేధం ఎత్తివేయాలని కోరిన 27 దేశాల్లో భారత్‌ కూడా ఉన్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం గంజాయిపై నిషేధం ఎత్తివేత దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. తాజాగా గోవా రాష్ట్రం నిషేధం ఎత్తివేసింది.
** గంజాయి దమ్ముకు బానిసలైనవారు శారీరకంగా, మానసికంగా కృంగిపోతుండటంతో దీని సాగు, క్రయ విక్రయాలను ప్రపంచమంతటా రద్దు చేశారు. అయినప్పటికీ దొంగచాటుగా గంజాయిని వినియోగంచేవారు భారత్‌లోనే మూడు కోట్ల మందికి పైగా ఉన్నట్టు అంచనా. ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా దేశంలో ఏటా రూ.34 కోట్ల విలువైన గంజాయిని సాగు చేస్తున్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. గంజాయిని అధికంగా వినియోగించే ఒక్క ఢిల్లీ నగరంలోనే ఇలా పన్నుల రూపంలో రూ.750కోట్ల నిధులు సమకూరుతాయని అంచనా. దేశంలో మద్యం తరువాత మత్తు కోసం అత్యధికులు వినియోగిస్తున్నది గంజాయే అంటే అతిశయోక్తి కాదు. అయితే మత్తునిచ్చి శరీరాన్ని గుల్లచేసే గంజాయిలో ఔషధ గుణాలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. గంజాయిని దీర్ఘకాలం వాడితే దానికి బానిసలవడం ఖాయం. వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతుంది. గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు నార్కొటిక్స్‌ విభాగం కృషి చేస్తూనే ఉన్నది. అయినప్పటికీ అధికారుల కళ్లు గప్పి గంజాయి సాగు, రవాణా, విక్రయాలు కొనసాగుతుండడం విశేషం. ఎన్ని ఆంక్షలు విధించినా దాని వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో గంజాయిపై నిషేధం ఎత్తివేయాలన్న డిమాండ్‌ ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంటున్నది.
*****నిషేధం ఎత్తివేయాలంటున్న దేశాలు
ఒకవైపు ఔషధప్రయోజనాలు, మరోవైపు ఆర్థిక వనరుల దృష్ట్యా అన్ని దేశాల దృష్టి గంజాయి మొక్కపై పడింది. నిషేధం ఎత్తివేయడం వల్ల ఎక్కువ మొత్తంలో ఆర్థిక వనరులను సమకూర్చుకోవచ్చని, తద్వారా కరోనా కష్టాలను అధిగమించవచ్చని అవి యోచిస్తున్నాయి. అదేవిధంగా గంజాయితో కలిగే ఔషధ ప్రయోజనాలను విస్తృతం చేయవచ్చని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2014లో అమెరికాలోని కొలరాడో రాష్ట్రం గంజాయి వ్యక్తిగత వినియోగం కోసం అనుమతులను జారీచేసింది. ఆ తరువాత కొలంబియాతోపాటు మరో 11 అమెరికా రాష్ర్టాలు అదేబాట పట్టాయి. ఈ అమ్మకాలను ప్రారంభించిన తరువాత ఆ రాష్ర్టాలు రూ.41వేల కోట్ల ఆదాయాన్ని పన్నుల రూపంలో పొందటం విశేషం. దీంతో ప్రపంచ దేశాలు సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. నిషేధం ఎత్తివేయడం వల్ల పర్యాటక రంగం కూడా విస్తృతమవుతుందని భావిస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవల జరిగిన ‘యూఎన్‌ కమిషన్‌ ఆన్‌ నార్కొటిక్స్‌ డ్రగ్స్‌’ సంస్థలోని 53 సభ్య దేశాల సమావేశంలో గంజాయిపై 1961లో చేసిన నిషేధ తీర్మానాన్ని పునఃపరిశీలించాయి. ఈ సందర్భంగా గంజాయిపై నిషేధం ఎత్తివేయాలని 27 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా అందులో భారత్‌ కూడా ఉండటం విశేషం. మిగతా 26 దేశాలు వ్యతిరేకించాయి.
*****భారత్‌లో 1985లో నిషేధం..
దేశంలో గంజాయిపై 1985 సంవత్సరం వరకు ఎలాంటి నిషేధం లేదు. నార్కొటిక్స్‌ డ్రగ్స్‌ సైకోట్రోఫిక్‌ సబ్‌స్టెన్స్‌ చట్టం తీసుకురావడంతో 1985లో భారత్‌లో గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. చట్టం ప్రకారం కిలో గ్రాము లోపల గంజాయిని రవాణా చేస్తే గరిష్ఠంగా రెండేండ్ల జైలు, రూ.10వేల జరిమానా, కేజీ నుంచి 20 కేజీల వరకు గంజాయిని కలిగి ఉంటే గరిష్ఠంగా పదేండ్ల జైలు, లక్ష వరకు జరిమానా విధిస్తారు. కొద్ది సంవత్సరాల క్రితమే గంజాయి సరఫరా, విక్రయదారులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టాలని నిర్ణయించారు. అయినప్పటికీ గంజాయి రవాణా, వినియోగం దేశంలో యథేచ్ఛగానే కొనసాగుతున్నది.
****భారత్‌లో అనాదిగా వినియోగం
దేశంలో గంజాయి వినియోగం అనాదిగా వస్తున్నది. ఇప్పటికీ దేశంలోని కొన్ని సమాజాలు గంజాయి మొక్కను పవిత్రంగా భావిస్తుంటాయి. కొన్ని సమాజాలు వైదిక కార్యక్రమాలలో, తీర్థప్రసాదాలుగా గంజాయిని తీసుకుంటాయి. పశ్చిమబెంగాల్‌ ప్రజలు ఘనంగా నిర్వహించుకొనే దుర్గాపూజ ఉత్సవాల సందర్భంగా గంజాయి ఆకులతో చేసిన పానీయాన్ని అతిథులకు ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. ఒడిశాలోని పూరిజగన్నాథుడి పరిచారకులు ప్రసాదంగా గంజాయిని తీసుకుంటారు. జానపద సంస్కృతిలో భంగ్‌కు ప్రముఖ స్థానమున్న విషయం తెలిసిందే. భంగ్‌ తయారీలో కూడా గంజాయినే ఎక్కువగా వినియోగిస్తారు. ఇక వైద్యరంగంలో కూడా పలు వ్యాధుల నివారణకు గంజాయితో తయారైన ఔషధాలను వాడుతున్నారు. ఉత్తరభారతంలో శారీరక రుగ్మతలను నయం చేసేందుకు గంజాయి ఆకులు, కాండం, రసం వినియోగిస్తారు. టెటనస్‌, హైడ్రోఫోబియా, రుమాటిజం, మూర్ఛ తదితర వ్యాధుల నివారణలో ఉపశమనకారిగా గంజాయినే వినియోగిస్తారు. చైనీయులు దీనిని శస్త్రచికిత్స సందర్భంగా రోగికి మత్తు ఇచ్చేందుకు వాడుతారు. లైంగిక వాంఛలు పెంచే ఔషధాలలోనూ దీనిని ఉపయోగిస్తున్నారు. పశువుల్లో వచ్చే పలు వ్యాధుల నివారణకు కూడా గంజాయిని ఇప్పటికీ కొందరు వాడుతున్నారు. అక్కడివరకు బాగానే ఉన్నా మోతాదు మించి దీనిని వాడడం వల్ల అనేక దుష్పరిణామాలు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది.
****దమ్ము బిగించి కొడుతున్నారు
*గంజాయి ఉత్పత్తిలో భారత్‌ది 0.01శాతం మార్కెట్‌ విలువ రూ.34వేల కోట్లు
*దేశంలో ఆల్కహాల్‌ తరువాత అత్యధికులు వినియోగిస్తున్నది గంజాయినే..
*భారత్‌లో గంజాయి దమ్ముకొట్టేవారు 3.1కోట్ల మంది (2.8శాతం).
*గంజాయి వినియోగిస్తున్న 120 నగరాల్లో మూడో స్థానంలో ఢిల్లీ, ఆరోస్థానంలో ముంబై.
*దేశంలో నమోదవుతున్న మాదకద్రవ్యాల కేసుల్లో గంజాయికి సంబంధించినవి 87శాతం.