* టాటా మోటార్స్ ఎస్‌యూవీ అభిమానులకు శుభవార్త చెప్పింది. తన సఫారీ మోడల్‌ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకురానుంది. గతేడాది టాటా సంస్థ వీటిని నిలిపివేసింది. కానీ, కొన్నాళ్ల క్రితం టాటామోటార్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. దానిలో సఫరీలో కాలక్రమంలో వచ్చిన మార్పులను తెలియజేసింది. అంతేకాదు ఓ కొత్తమోడల్ రేఖా చిత్రాన్ని ఉంచింది.. నేడు ఆల్‌న్యూ సఫారీని విడుదల చేయనున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. దీనిపై నేడు వివరాలు వెల్లడిస్తూ గ్రావిటాస్ పేరుతో టాటా సఫారీ ప్రాజెక్టును పునరుద్ధరించినట్లు వెల్లడించింది. గ్రావిటాస్‌ను గతేడాది ఆటోఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఇప్పుడు అదే సఫారీగా మారింది.
* హోండా మోటార్స్ సైకిల్స్ తన ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీవిరమణ పథకం ప్రకటించింది. ఈ పథకాన్ని అంగీకరించిన తొలి 400 మంది ఉద్యోగులకు అదనంగా రూ.50,000 ఇస్తామని పేర్కొంది. హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఒక గ్రూప్ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీవిరమణ పథకాన్ని ప్రకటించింది. భారత్‌లో కొవిడ్ కారణంగా డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు కంపెనీ లేఖలో పేర్కొంది. హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా భారత్‌లో తన ఉనికిని కాపాడుకొనేదుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు జనవరి 5వ తేదీన ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన లేఖలో పేర్కొంది.
* దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఫార్మా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో పది రోజులుగా వరుస లాభాలతో దూసుకెళ్తున్న సూచీలకు బ్రేక్ పడినట్లయ్యింది. ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు ప్రధానంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
* దేశంలో పెట్రోల్ ధరలు త్వరలో అత్యధిక స్థాయి ని దాటవచ్చని తెలుస్తోంది. 29 రోజుల పాటు స్థిరంగా ఉన్న ధరలు ఈ రోజు 26 పైసల వరకు పెరిగాయి. డీజిల్ ధర కూడా 25 పైసల వరకు పెరిగింది. హైదరాబాద్ లో ప్రస్తుత పెట్రోల్ ధర రూ. 87.34, డీజిల్ ధర రూ. 80.88 ఉంది. కోవిడ్ వల్ల అంతర్జాతీయ క్రూడ్ ధరలు కొంత వరకు తగ్గాయి. అయితే, ఇప్పుడు వాక్సిన్ వస్తుండటంతో ధరల్లో పెరుగుదల కనపడుతోంది. ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ ధర సుమారుగా $53.86 వరకు ఉంది. ఈ ధర లో ప్రతి డాలర్ పెరుగుదలకి మన దేశపు ఆయిల్ దిగుమతుల మీద రూ. 10,700 కోట్ల వరకు భారం పడవచ్చు.
* ఉన్నత హోదాల్లో లింగ వివక్షను రూపుమాపేలా జర్మనీ ప్రభుత్వం చారిత్రక చట్టం తీసుకొస్తోంది. లిస్టెడ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ బోర్డుల్లో తప్పనిసరిగా మహిళలు ఉండేలా రూపొందించిన బిల్లుకు అక్కడి పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. నూతన మూసాయిదా చట్టం ప్రకారం.. నలుగురు అంతకంటే ఎక్కువ ఎగ్జిక్యూటివ్‌లు ఉండే లిస్టెడ్ కంపెనీలు కనీసం ఒక మహిళను బోర్డు సభ్యురాలిగా నియమించాల్సి ఉంటుంది. యూరప్ దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీలో మహిళలకు ఉన్నత హోదా అనేది అంతంతమాత్రంగానే ఉంది. ఆ దేశ లిస్టెడ్ కంపెనీల్లో కేవలం 12.8శాతం మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యులు మాత్రమే మహిళలు. అదే అమెరికాలో 28.6శాతం, బ్రిటన్‌లో 24.5శాతం, ఫ్రాన్స్‌లో 22.2శాతం మంది మహిళలు కంపెనీల్లో మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఇక జర్మనీలో మహిళ సగటు ఆదాయం కూడా పురుషులతో పోలిస్తే 20శాతం తక్కువగా ఉంది. దీంతో ఉన్నత హోదాల్లో లింగ వివక్షను తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని రూపొందించింది. మేనేజ్‌మెంట్ బోర్డుల్లో మహిళలు తప్పనిసరిగా ఉండాలంటూ బిల్లును ఆమోదించింది.
* విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నగరంలోని ద్వారకా బస్‌స్టేషన్‌లో ఖాళీగా ఉన్న జి+4 భవనాన్ని ఆర్టీసీ పరిపాలన భవనంగా మార్చే అవకాశం ఉందని సమాచారం. గతంలో ఈ భవనాన్ని జీవీఎస్‌సీసీఎల్ (గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్) అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించింది. ఇటీవల ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. కొత్తగా రంగులేసి సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఆర్టీసీ పరిపాలన భవనం ఉండగా, దాన్ని ద్వారకా బస్‌స్టేషన్ భవనంలోకి మార్చే అవకాశాలున్నాయని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు.