అమెరికాలోని క్యాపిటల్ భవనంలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఫేస్‌బుక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాపై విధించిన 24గంటల నిషేధాన్ని నిరవధికంగా మారుస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. జో బైడెన్‌కు అధికారం అప్పగించే విషయంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల్లో తమ ఫేస్‌బుక్‌ను ట్రంప్ ఉపయోగించుకున్న తీరును తప్పుబట్టారు. గడిచిన 24గంటల్లో జరిగిన షాకింగ్ ఘటనలు.. ట్రంప్ తన పదవిలో మిగిలి ఉన్న సమయాన్ని.. జో బైడెన్‌కు అధికార మార్పిడిని అణగదొక్కేందుకు ఉపయోగించే విధంగా కనిపిస్తోందని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. క్యాపిటల్ భవనంలో ఆయన మద్దతుదారుల చర్యలను ఖండించడానికి బదులుగా వారి చర్యలను సమర్థించేలా ఫేస్‌బుక్‌ను వాడుకోవడం అమెరికా ప్రజలనే కాదు.. ప్రపంచాన్ని కలవరపరిచిందని పేర్కొన్నారు. హింసను ప్రేరేపించే ఉద్దేశంతో చేసినట్లు ఉన్న ట్రంప్ ప్రకటనల్ని తాము నిన్ననే తొలగించామని జుకర్‌బర్గ్ తెలిపారు. మిగిలిన ఈ 13 రోజులు ప్రజాస్వామిక నిబంధనలకు అనుగుణంగా శాంతియుతంగా ఉండాలని కోరారు. గత కొన్నేళ్లుగా ట్రంప్ తమ నిబంధనలకు అనుగుణంగా ఫేస్‌బుక్ ఉపయోగించుకొనేందుకు అనుమతించినట్టు జుకర్ బర్గ్ చెప్పారు. కొన్ని సందర్భాల్లో కంటెంట్ తొలగించడమో లేదా తమ విధానాలను ఉల్లంఘించినప్పుడు ఆయన పోస్ట్‌లను లేబిలింగ్ చేయడమో జరిగిందని వివరించారు. కానీ ప్రస్తుత సందర్భం మాత్రం వాటికి పూర్తి విరుద్ధమైందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక తిరుగుబాటును ప్రేరేపించేలా తమ వేదికను ఉపయోగించారని తెలిపారు. ఈ కీలక సమయంలో అలా జరగకుండా ఉండేందుకు ఆయన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై విధించిన 24గంటల నిషేధాన్ని నిరవధికంగా మారుస్తున్నట్టు స్పష్టంచేశారు. అధికార మార్పిడి సజావుగా పూర్తయ్యేంత వరకైనా కనీసం రెండు వారాల పాటు ఈ నిషేధం కొనసాగుతుందని పేర్కొన్నారు.
రెండు వారాల నిషేధం
Related tags :