పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి కుటుంబాలకు తక్కువ ధరకు ఇళ్ల స్థలాలను కేటాయించేలా లేఅవుట్ల అభివృద్ధి కోసం ఒక విధానం సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వైఎస్ఆర్ హయాంలో రాజీవ్ స్వగృహ పేరిట పథకాన్ని అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో కలిసి ముఖ్యమంత్రి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సమీక్ష జరిపారు. ‘గతంలో రాజీవ్ స్వగృహలో ఇళ్లు కేటాయించారు. ఇప్పుడు వివాదాల్లేని స్థలాలను తక్కువ ధరకు ఇచ్చే కార్యక్రమాన్ని రూపొందించాలి’ అని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద స్థలాలు కొంటే టైటిల్ సరైనదేనా.. అనుమతులు ఉన్నాయా, లేవా అనే భయాలు ఉంటున్నాయి. ప్రభుత్వమే లేఅవుట్లు అభివృద్ధి చేస్తే అవన్నీ తొలగిపోతాయి. మధ్యతరగతి ప్రజల కోసం ఏదైనా చేయాలన్న క్రమంలో ఈ ఆలోచన వచ్చింది. దీనిపై అధికారులు ఆలోచించి ప్రజల సొంతింటి కల సాకారమయ్యేలా చూడాలి’ అని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు.గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాలను కలిపి నగరపాలక సంస్థగా (మున్సిపల్ కార్పొరేషన్) ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. వీటిలో అభివృద్ధి పనులకు సంబంధించి రూ.1,000 కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ‘భీమిలి నుంచి భోగాపురం వరకు తీరం వెంబడి 6 వరుసల్లో బీచ్ రోడ్డును అభివృద్ధి చేయనున్నాం. ఈ రహదారి విశాఖపట్నానికి ఒక చిహ్నంలా మిగిలిపోనుంది. దీనికి అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలి. పట్టణాల్లో ఘన వ్యర్థాల యాజమాన్య కార్యక్రమాల నిర్వహణలో కొత్త విధానాలను పరిశీలించాలి. పట్టణ గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలి’ అని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
జగన్ సర్కార్ ఆధ్వర్యంలో మళ్లీ…రాజీవ్ స్వగృహ!
Related tags :