విదేశీ నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు పొందేందుకు వీలు కల్పించే హెచ్-1బి వీసాల ఎంపిక ప్రక్రియలో కీలక సవరణలు చేపట్టనున్నట్లు అమెరికా ప్రకటించింది. ప్రస్తుతమున్న లాటరీ విధానం మాదిరిగా కాకుండా.. అభ్యర్థుల ఎంపికలో వేతనాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తామని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) అధికారులు తెలియచేశారు.
కొత్త విధానంలో తమ దేశ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటామని.. అదే విధంగా నిపుణులైన విదేశీ సిబ్బందికి కూడా తాత్కాలిక ఉపాధి కార్యక్రమం ద్వారా మేలు జరుగుతుందని వారు వివరించారు. అధిక సామర్థ్యం, నైపుణ్యం గత సిబ్బందికి తగినట్టుగా అధిక వేతనం అందించే ఈ కొత్త విధానం అందరికీ లాభదాయకమేనని అధికారులు తెలియచేశారు. కాగా, ఈ అంశంలో తుది నిర్ణయాలను స్థానిక కాలమానం ప్రకారం జనవరి 8న ఫెడరల్ రిజిస్టర్లో నమోదు చేస్తామని అమెరికా అధికారులు తెలిపారు. తదనంతరం ఈ విధానం 60 రోజుల వరకు అమలులో ఉంటుందని వారు ప్రకటించారు.
ప్రస్తుతమున్న తాత్కాలిక వీసా విధానాన్ని ప్రాథమిక స్థాయి ఉద్యోగాల్లో నియమించేందుకు ఉపయోగించటం ద్వారా యాజమాన్యాలు దుర్వినియోగం చేస్తున్నారని.. దీనిని అరికట్టేందుకే ఈ సవరణలు చేపట్టామని యూఎస్సీఐఎస్ డిప్యూటీ డైరక్టర్ ఫర్ పాలసీస్ జోసెఫ్ ఎడ్లో వివరించారు. కాగా, భారత్తో సహా పలు దేశాలకు చెందిన లక్షలాది నిపుణులకు అమెరికా కొలువులను అందించే హెచ్-1బి వీసా నమోదు కార్యక్రమం ఈ సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభం కావాల్సి ఉంది.