అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘం ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)లో ఎన్నికల కోలాహలం ఆరంభమైంది. ఇప్పటివరకు తానా 2021 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే తానా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. తానా తదుపరి అధ్యక్ష పదవికి (ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్) ఈ సారి తీవ్రపోటీ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. తానా ఫౌండేషన్ ప్రస్తుత అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ (డెట్రాయిట్) తాను తానా అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత రెండు రోజుల నుండి శృంగవరపు తన ప్రచారాన్ని విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు. మరో వైపు తానా ఫౌండేషన్ మాజీ అధ్యక్షుడు గోగినేని శ్రీనివాస (డెట్రాయిట్) సైతం తానా అధ్యక్ష పదవికి రంగంలోకి దిగినట్లు వెల్లడించారు. ఈయన కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గత ఎన్నికల్లో కూడా గోగినేని శ్రీనివాస అధ్యక్ష పదవికి పోటీ చేశారు. తానా తదుపరి అధ్యక్ష పదవికి మరికొందరు అభ్యర్థులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే వారు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. తానా ప్రస్తుత కార్యదర్శి పొట్లూరి రవి (ఫిలడెల్ఫియా), మాజీ కార్యదర్శి వెన్నం మురళీ (డాలస్) తదితరులు తానా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. వాషింగ్టన్ డీసీకి చెందిన కొడాలి నరేన్ కూడా అధ్యక్ష పదవి బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ విషయంపై స్పష్టత రావచ్చు. ఈ సారి తానా ఆధ్యక్ష పదవితో పాటు కార్యదర్శి, కోశాధికారి తదితర పదవులకు పోటీ తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.
తానాలో ఎన్నికల కోలాహలం-TNI ప్రత్యేకం
Related tags :