Business

బంగారం కొనేవారికి నిబంధనలు వర్తించవు-వాణిజ్యం

బంగారం కొనేవారికి నిబంధనలు వర్తించవు-వాణిజ్యం

* పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఈ పెన్షన్ పథకంలో 2020 డిసెంబర్ 31 వరకు 52 లక్షలకు పైగా కొత్త చందాదారులు చేరారు. దీనితో మొత్తం నమోదు 2.75 కోట్ల మైలురాయిని దాటింది. 2020-21 మధ్యకాలంలో కేవ‌లం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ద్వారా 15 లక్షలకు పైగా కొత్త చందాదారులు అటల్ పెన్షన్ యోజన (ఎపివై) లో చేరారు.

* బంగారం, వెండి లేదా రత్నాభరణాలను నగదు ఇచ్చి కొనుగోలు చేసే వారందరికీ కొత్త కేవైసీ నిబంధనలు వర్తించవని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అధిక విలువ నగదు లావాదేవీలకు మాత్రం శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌), ఆధార్‌ వంటి ధ్రువీకరణలు ఇవ్వాల్సి వస్తుందని రెవెన్యూ విభాగం 2020 డిసెంబరు 28న జారీ చేసిన నోటిఫికేషన్‌ పేర్కొంటోంది. ఆభరణాలు, మేలిమి బంగారం, విలువైన రత్నాలను రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదుతో కొనుగోలు చేయాలంటే కేవైసీ ఉండాల్సిందే. కొన్నేళ్లుగా అమలవుతున్న ఈ విధానం కొనసాగుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం 2002 కింద డిసెంబరు 28న జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు ద్వారా బంగారం, వెండి, ఆభరణాలు, విలువైన రాళ్లను కొనుగోలు చేసే వ్యక్తులు, లేదా సంస్థలు కేవైసీ పత్రాలు నింపాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి అని తెలిపింది.

* డీమార్ట్‌ పేరిట రిటైల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ మూడో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.446.95 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని పొందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.384.01 కోట్లు కావడం గమనార్హం. ఈ లెక్కన నికర లాభం 16.39 శాతం మేర పెరిగినట్లు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ పేర్కొంది.

* భవిష్యత్‌లో బంగారం ధరలు భారీగా పతనం కానున్నాయా? కరోనా వేళ అంతకంతకు పెరిగిపోయిన పసిడి ధరలు వ్యాక్సిన్‌ రాకతో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా? శుక్రవారం నాటి ఫ్యూచర్‌ ట్రేడింగ్స్‌ ఫిబ్రవరి నెలకు సంబంధించి బంగారం ధర ఏకంగా రూ.2వేలు తగ్గడం గమనార్హం.