ఓయూలో 2020 సంవత్సరంలో 28 మంది పదవీ విరమణ పొందారు. 2021లో మరో 20 మంది, 2022లో 20 మంది పదవీ విరమణ పొందనున్నారు. మరో మూడేళ్లలో ఓయూ, కేయూలోనే కనీసం 150 మంది వరకు ఉద్యోగ విరమణ పొందుతారని సమాచారం. ఓయూలో 2014 జూన్ తర్వాత ఖాళీ అయినవే 250 వరకు ఉన్నాయి. ఇక కాకతీయ వర్సిటీలో 281 ఖాళీలు ఉండగా, అయిదు సంవత్సరాల్లో 100 మందికిపైగా పదవీ విరమణ చెందారు. జేఎన్టీయూహెచ్లో ఈ నాలుగు సంవత్సరాల్లోనే 30 మంది పదవీ విరమణ పొందారు. వెంటనే నియామకాలు చేపట్టకుంటే వర్సిటీలు ఖాళీ అవుతాయని సంబంధిత వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఓయూలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సైకాలజీ విభాగంలో ఇప్పుడు కేవలం ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు బోర్డు ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా, మరొకరు విభాగాధిపతిగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ప్రొఫెసర్ స్థాయి వారే ఆ పోస్టుల్లో ఉండాలి. ఆచార్యుడి స్థాయి వారు ఒక్కరూ లేకపోవడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లే ఆ హోదాలో కొనసాగాల్సిన దయనీయ పరిస్థితి. వాస్తవానికి ఈ విభాగంలో మంజూరు పోస్టులు 11 కావడం గమనార్హం. బాసర ఆర్జీయూకేటీలో ఒక్క రెగ్యులర్ అధ్యాపకుడు కూడా లేడు. కాకతీయ విశ్వవిద్యాలయంలో 71 శాతం బోధన సిబ్బంది ఖాళీలున్నాయి. దేశంలోనే వందేళ్లు పూర్తయిన అరుదైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఓయూలోనూ 67 శాతం పోస్టులు భర్తీకి నోచుకోలేదు.
ఆచార్యులు, సహాయ, సహ ఆచార్యులతో కళకళలాడాల్సిన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు సగటున 65 శాతం ఖాళీలతో వెలవెలబోతున్నాయి. సమాజానికి దిక్సూచిగా నిలవాల్సిన అవి బోధనా సిబ్బంది కొరతతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. తెలంగాణలో ఏ విశ్వవిద్యాలయాన్ని చూసినా…ఏ విభాగాన్ని పరిశీలించినా ఇదే దుస్థితి. అన్ని వర్సిటీల్లోనూ పనిచేస్తున్న బోధకుల కంటే ఖాళీలే ఎక్కువ కన్పిస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. ఏళ్ల తరబడి ఆచార్యుల ఖాళీలను భర్తీ చేయకపోవడం, పదవీ విరమణ పొందుతున్న వారి స్థానాలను అలాగే వదిలేస్తుండటంతో బోధన ప్రమాణాలు నానాటికీ పడిపోతున్నాయి. ఫలితంగా విశ్వవిద్యాలయాలు కాస్తా విశ్వ‘మిథ్యా’లయాలుగా మారాయి. ఉదాహరణకు ఓయూ బిజినెస్ మేనేజ్మెంట్లో 32 మందికి 13 మందే ఉన్నారు. వన్‌మ్యాన్ ఆర్మీగా జియో కెమిస్ట్రీ, సంస్కృతం, ఆర్కియాలజీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ విభాగాలు పనిచేస్తున్నాయి. ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, తమిళం లాంటి పలు భాషా విభాగాల్లో బోధన సిబ్బంది ఒక్కరూ లేరు. ఈ వర్సిటీలో అతిపెద్ద విభాగంగా పేరొందిన రసాయనశాస్త్రంలో 101 మందికి 43 మందే ఉండటాన్నిబట్టి ఇక్కడ బోధనా సిబ్బంది కొరత తీవ్రతను అంచనా వేసుకోవచ్చు. సిద్దిపేట, జోగిపేట, నర్సాపూర్ పీజీ కళాశాలలు శాశ్వత ఆచార్యులు ఒక్కరూ లేకుండానే నడుస్తున్నాయి. కేయూలో ఒకప్పుడు 23-24 మందితో నడిచిన విభాగాలు ఇప్పుడు ముగ్గురికే పరిమితమయ్యాయి. పొలిటికల్ సైన్స్, ఆర్థికశాస్త్రంలో ఒక్కరే పనిచేస్తున్నారు.
* పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలు ప్రొఫెసర్ స్థాయి వారు ఒక్కరూ లేకుండానే నడుస్తుండగా, శాతవాహనలో ఒకే ఒక్క ఫ్రొఫెసర్ ఉన్నారు.
* తెలంగాణ విశ్వవిద్యాలయంలోని స్టాటిస్టిక్స్ విభాగంలో ఏడుగురు శాశ్వత అధ్యాపకులు అవసరంకాగా, ఒక్క సహాయ ఆచార్యుడే ఉన్నారు. ఆంగ్ల విభాగంలో ఏడు పోస్టులకుగాను కేవలం ఇద్దరు సహాయ ఆచార్యులే పనిచేస్తున్నారు. ఇవే కాదు ఏ విశ్వవిద్యాలయం, ఏ విభాగం తీసుకున్నా పరిస్థితి ఇంతకన్నా భిన్నంగా ఏమీ లేదు.