సరీసృపాలలో అరుదైన కొండచిలువల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. విషపూరిత సర్పాలు కానప్పటికీ మానవుల చేతుల్లో హతమవుతున్నాయి. ప్రకృతి సౌందర్యానికి నెలవైన కొల్లేరులో ఎక్కువగా ఉన్న కొండచిలువలు విషపూరితం కాకపోయినా.. కనిపిస్తే అంతమవుతున్నాయి. కొల్లేరులో పక్షులతోపాటు వివిధ జాతుల సరీసృపాలు జీవిస్తున్నాయి. వీటిలో ఇండియన్ రాక్ పైథాన్ ఒకటి. ఈ కొండచిలువ కొల్లేరు ప్రాంత ప్రజల చేతుల్లో ఎక్కువగా దాడికి గురవుతోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ఉప్పుటేరు పరీహవాక ప్రాంత పరిధిలో వీటి సంచారం ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల కృష్ణాజిల్లా కలిదిండి మండలం కొండంగి, మట్టగుంట, పడమటిపాలెం, కైకలూరు మండలం ఆటపాక, ముదినేపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి మృత్యువాతపడ్డాయి. కొద్ది ఘటనలలో మాత్రమే అటవీశాఖ అధికారులు వీటిని రక్షిస్తున్నారు.
**చిత్తడి నేలలు అనుకూలం
కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తొమ్మిది మండలాల పరిధిలో 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. రెండు జిల్లాల్లో 2.25 లక్షల ఎకరాల్లో ఆక్వా చెరువులు సాగవుతున్నాయి. ఇక్కడి చిత్తడి నేలలు కొండచిలువలకు అనుకూల ఆవాసాలుగా మారాయి. చేపలు, రొయ్యల చెరువుల సమీపంలో ఉంటున్న ఇవి చెరువులపై కోళ్లు, పక్షులు, ఎలుకలను ఆహారంగా తీసుకుంటున్నాయి. నీటిలో వేగంగా ప్రయాణించగలిగిన కొండచిలువలు ఆహార అన్వేషణలో భాగంగా బయటకు వచ్చి ప్రజల చేతిలో మృత్యువాతపడుతున్నాయి.
***అరుదైన జాతి
ఇండియన్ రాక్ పైథాన్ శాస్త్రీయ నామం పైథాన్ మోలురూస్. ఇది 9.8 అడుగుల పొడవు పెరుగుతుంది. బరువు 25 కిలోల వరకు ఉంటుంది. ముదురు గోధుమ రంగుపై నల్లటి డైమండ్ మచ్చలు ఉంటాయి. విషపూరితమైనవి కావు. క్షీరదాలు, పక్షులు, ఎలుకలను ఆహారంగా తీసుకుంటాయి. పూర్తిగా ఆహారం తీసుకున్నాక వారం పాటు ఏమీ తినకుండా ఉండగలవు. చిత్తడి నేలలు, గడ్డిభూములు, ఎర్రనేలలు, మడ ఆడవుల్లో ఉంటాయి. ఇవి వంద గుడ్ల వరకు పొదుగుతాయి. పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ దేశాల్లో వీటి సంతతి ఉంది. ఇండియన్ రాక్ పైథాన్‌ను.. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎస్) హానికలిగే జాతుల జాబితా (రెడ్ లిస్ట్)లో చేర్చింది.
అంతరించిపోతున్న జాబితాలోకి కొండచిలువలు
Related tags :