* పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్… ఒక్క రోజు కూడా గడవక ముందే రాష్ట్ర ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఆపేయాలని ఆయన ఆదేశించారు. అమల్లో ఉన్న పథకాలను కూడా ఆపేయాలని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయించినా ఓటర్లను ప్రభావితం చేసినట్టే అవుతుందని స్పష్టం చేశారు.
* ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకెళ్తోంది. ఓ పక్క ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, ఎన్నికల సంఘం తన ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. మరోవైపు ఎన్నికల విధుల్లో తాము పాల్గొనలేమంటూ ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్పందించారు. అందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిద్దామని పిలుపు నిచ్చారు. ఈ మేరకు 2 పేజీల ప్రకటనను విడుదల చేశారు. పోలింగ్ సిబ్బంది భద్రతకు పూర్తి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
* రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదల చేశారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సోమవారం నెల్లూరులో రెండో విడత జగనన్న అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఏ ఎన్నికలకైనా వైకాపా ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎంత చెప్పినా ఎస్‌ఈసీ వినడం లేదని మంత్రి మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్, మేకపాటి గౌతం రెడ్డితో కలిసి నెల్లూరులో మంత్రి సురేశ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నియమావళికి లోబడే నెల్లూరులో జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.
* దేశంలో ఓ వైపు డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ కొవిడ్ నేపథ్యంలో ప్రజలు నగదును చేతిలో ఉంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనన్న ముందు జాగ్రత్తతో నోట్లను అట్టిపెట్టుకుంటున్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో ఏకంగా 13 శాతం నగదు చలామణీ పెరిగినట్లు ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి. 2020 మార్చి 31 నాటికి చలామణీలో ఉన్న నగదు విలువ రూ.24,47,312 కోట్లు కాగా.. ఈ ఏడాది జనవరి 1 నాటికి ఆ మొత్తం రూ.27,70,315 కోట్లకు పెరిగినట్లు రిజర్వ్ గణాంకాలు చెబుతున్నాయి.
* చైనాలో పుట్టి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి బయటపడి ఇప్పటికే సంవత్సరం పూర్తయ్యింది. ఇక తొలి కరోనా మరణం సంభవించి ఏడాది అయినప్పటికీ ఇంతవరకూ కరోనా వైరస్ మూలాలు తెలియక పోవడం శాస్త్రవేత్తల్లో అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. అయితే, అంతర్జాతీయ సమాజంతో వైరాన్ని నెరిపే చైనా, గోప్యత, గందరగోళ తనంతో ప్రపంచానికి కరోనా మూలాలను బహిర్గతం చేయడం కష్టమేనని అంతర్జాతీయ నిపుణులు పెదవి విరుస్తున్నారు.
* కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల కలిగే లాభాలను వివరించేందుకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తలపెట్టిన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం పాల్గొనదలచిన సభా ప్రాంగణాన్ని రైతులు ధ్వంసం చేశారు. దీంతో ముఖ్యమంత్రి తన సభను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు మేలు చేసే విధంగా ఉన్నాయంటూ రైతులు ఆందోళన చేస్తుండగా.. మరోవైపు ఆ చట్టాల వల్ల ఉపయోగాలున్నాయంటూ భాజపా సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో హరియాణాలోని కర్నల్ జిల్లాలోని కైమ్లాలో ‘కిసాన్ మహా పంచాయత్’ పేరిట ఆదివారం ఖట్టర్ రైతులతో కార్యక్రమం తలపెట్టారు. ఈ సభను ఎలాగైనా అడ్డుకునేందుకు భారతీయు కిసాన్ యూనియన్ (బీకేయూ) నేతృత్వంలోని రైతులు ఆ గ్రామానికి ర్యాలీ తీశారు. దీంతో వారిని అడ్డుకునేందుకు హరియాణా పోలీసులు జల ఫిరంగులు, బాష్పవాయువును ప్రయోగించారు.
* లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీని వెనక్కి రప్పించాలంటూ పుదుచ్ఛేరి సీఎం నారాయణ స్వామి చేస్తున్న దీక్ష మూడో రోజుకు చేరింది. ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డుపడుతున్న కారణంగా ఆమెను వెంటనే తొలగించాలంటూ ఆయన శుక్రవారం దీక్ష ప్రారంభించారు. గవర్నర్ నివాసానికి కూతవేటు దూరంలోనే ఓ టెంట్ వేసి దీక్షాస్థలిగా మార్చారు. తిండీ, నిద్ర అన్నీ అక్కడే చేపడుతున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు సైతం అక్కడే చేస్తున్నారు. నారాయణ స్వామి ఆందోళనకు పుదుచ్ఛేరి కాంగ్రెస్ అధ్యక్షుడు, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ, సీపీఎంకు చెందిన నేతలు సైతం దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు.
* ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిడ్నీ టెస్టులో హైదరాబాదీ యువపేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఎదురైన అవాంఛనీయ సంఘటనను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా ఖండించాడు. ప్రేక్షకులు రౌడీల్లా ప్రవర్తించారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. నాలుగో రోజు ఆటలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్‌ను ఉద్దేశించి కొందరు ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఆటలోనూ సిరాజ్, బుమ్రాకు ఇలాంటి సంఘటనే ఎదురవ్వడం గమనార్హం.
* కొవిడ్-19 మూలంగా ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యే కళాశాల విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రోజుకు 2జీబీ చొప్పున ఉచిత డేటా అందించనున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ‘ఉచిత’ సదుపాయం వర్తిస్తుందని సీఎం పళని స్వామి ప్రకటించారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న 9.69 లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు.
* అమెరికాకు చెందిన సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ పార్లర్‌పై యాపిల్ సంస్థ చర్యలు చేపట్టింది. తమ యాప్ స్టోర్ నుంచి పార్లర్‌ను తొలగించింది. క్యాపిటల్ భవనంపై జరిగిన దాడికి పార్లర్ యాప్‌ను ఉపయోగించుకొన్నారని యాపిల్ ఆరోపిస్తోంది. 24 గంటల్లోపు ఆ సంస్థ యాప్‌లో మార్పులు చేర్పులకు సంబంధించిన ప్రణాళికతో తమ వద్దకు రావాలని యాపిల్ సూచించిన తర్వాత ఈ చర్యలు తీసుకొంది. ఇప్పటికే పార్లర్ కూడా యాప్‌లో మార్పులకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
* వెంకటేశ్ కథానాయకుడిగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘చంటి’. మీనా, నాజర్, సుజాత, మంజుల, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 1992 జనవరి 10న విడుదలైన ఈ చిత్రం 29ఏళ్లు పూర్తి చేసుకుంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘చినతంబి’ని తెలుగులో ‘చంటి’గా తీశారు నిర్మాత కె.ఎస్.రామారావు. అమాయకుడైన పల్లెటూరి యువకుడి పాత్రలో వెంకటేశ్ నటన అందరినీ మెప్పించింది. తొలుత ఈ సినిమాలో కథానాయకుడిగా రాజేంద్రప్రసాద్ అనుకున్నారట. అయితే, వెంకటేశ్‌తో సినిమా చేయడానికి గల కారణాన్ని దర్శకుడు రవిరాజా ఓ సందర్భంలో పంచుకున్నారు.
* తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో 60 మంది ఉద్యోగులకు ఈవో జరిమానా విధించారు. ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున జరిమానా విధిస్తూ ఈవో త్రినాథరావు ఆదేశాలిచ్చారు. దేవస్థానం హుండీ లెక్కింపునకు ఉద్యోగులంతా హాజరు కావాలని ఆయన ఆదేశించారు. కానీ, ఎక్కువ మంది సిబ్బంది ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈవో జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.