* అటానమస్ విద్యుత్తు కార్ల తయారీ కోసం దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్, యాపిల్ ఐఎన్‌సీ జట్టుకట్టనున్నాయి. మార్చి నాటికి వీరు డీల్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 2024 తొలి అర్ధభాగం నుంచి అమెరికాలో వీటి ఉత్పత్తిని మొదలుపెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ విషయాన్ని కొరియా ఐటీ న్యూస్‌పేపర్ వెల్లడించింది. ఇప్పటికే శుక్రవారం హ్యుందాయ్ కూడా ఈ విషయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించింది. యాపిల్‌తో చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని పేర్కొంది. దీంతో హ్యుందాయ్‌షేర్లు దాదాపు 20శాతం పెరిగాయి. ఇరు సంస్థలు అభివృద్ధి చేసిన కారును జార్జియాలోని కియా మోటార్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయాలని లేకపోతే సంయుక్తంగా మరో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అమెరికాలోని ప్లాంట్‌లో 2024లో లక్ష కార్ల వరకు ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నారు. ఫ్యాక్టరీ మొత్తం సామర్థ్యం ఏటా 4లక్షల కార్లుగాఉండే అవకాశం ఉంది. కియా మోటార్స్ హ్యుందాయ్ అనుంబంధ సంస్థే. ఈ రెండు సంస్థలు కలిసి వచ్చే ఏడాది యాపిల్ కార్ బీటా వెర్షన్‌ను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. కొరియా పత్రిక కథనంపై యాపిల్, హ్యుందాక్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
* తిరుపతి నుంచి హుబ్బల్లి, కలబురగి విమానాశ్రయాలకు స్టార్ ఎయిర్‌లైన్స్ నూతన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
* ఆడపిల్లలున్న తల్లి లేదా తండ్రి పన్ను-పొదుపు పెట్టుబడులను ఎన్నుకునేటప్పుడు సుకన్య సమృద్ది ఖాతా (ఎస్‌ఎస్‌ఏ) ను ఎంచుకుంటారు. జనవరి-మార్చి త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికంలో సవరిస్తారు. సుకన్య సమృద్ధి ఖాతా తెరిచిన తరువాత, మీరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) యాప్‌లో ఆన్‌లైన్‌లో ద్వారా దీనిని నిర్వహించవచ్చు.
* దేశీయ మార్కెట్లు మరోసారి జీవనకాల గరిష్ఠాలను తాకాయి. ఐటీ, ఆటో షేర్ల అండతో భారీ లాభాల్లో ముగిశాయి. మూడో త్రైమాసిక ఫలితాల్లో టీసీఎస్ అదరగొట్టిన నేపథ్యంలో ఆ కంపెనీతో పాటు మిగిలిన ఐటీ కంపెనీల షేర్లూ రాణించాయి. వాహన షేర్లు సైతం రాణించడంతో తొలిసారి సెన్సెక్స్ 49 వేల మార్కును దాటింది. నిఫ్టీ 14,500 మార్కుకు కొద్ది దూరంలో నిలిచింది.
* డిసెంబరులో ప్యాసెంజర్ వాహనాల రిటైల్ విక్రయాల్లో 23.99 శాతం వృద్ధి నమోదైనట్లు ‘ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఎఫ్‌ఏడీఏ)’ వెల్లడించింది. 2019 డిసెంబరులో 2,18,775 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. ఈ డిసెంబరులో అవి 2,71,249కి పెరిగాయి. ద్విచక్రవాహనాల విక్రయాలు 2019, డిసెంబరులో 12,73,318 అమ్ముడయ్యాయి. ఈసారి అవి 11.88 శాతం పెరిగి 14,24,620 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక వాణిజ్య వాహన విక్రయాలు ఈసారి తగ్గాయి. 2019 డిసెంబరులో 59,497 వాహనాలు అమ్ముడుకాగా.. ఈసారి అవి 13.52 శాతం తగ్గి 51,454 యూనిట్లకు పరిమితమైంది. ఇక త్రీవీలల్ విక్రయాలు సైతం 52.75 శాతం కుంగాయి. ట్రాక్టర్ అమ్మకాలు 35.49 శాతం పెరిగాయి. స్థూలంగా అన్ని విభాగాల్లో కలిపి డిసెంబరులో వాహన విక్రయాలు 11.01 శాతం పెరిగాయి. 2019, డిసెంబరులో 16,61,245 యూనిట్లు విక్రయించగా.. ఈ డిసెంబరులో ఆ సంఖ్య 18,44,143కు ఎగబాకింది.