Politics

అప్పుడు ముద్దులు….ఇప్పుడు గుద్దులు-తాజావార్తలు

అప్పుడు ముద్దులు….ఇప్పుడు గుద్దులు-తాజావార్తలు

* రైతులు ఎక్కడా ఆనందంగా లేరని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా పరిటాలలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 5 జీవోలను చంద్రబాబు భోగిమంటల్లో వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ… పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్‌ ఇప్పుడేమో పిడిగుద్దులు గుద్దుతున్నాడని విమర్శించారు. ప్రజావేదికను కూల్చి శాడిస్టుగా వ్యవహరించారని మండిపడ్డారు. ‘‘ఏడు వరుస విపత్తులతో రైతులు నష్టపోతే పరిహారం ఇవ్వలేదు. అసత్యాలతో రైతులను దగా చేస్తున్నారు. రైతుల కోసం నేను పోరాడుతుంటే మైనింగ్‌ మాఫియా, బెట్టింగ్‌, బూతుల మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

* తెలంగాణ లో కొత్తగా 331 కొవిడ్‌ కేసులు నమోదు కాగా మరో మూడు మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,90,640 కి, మృతుల సంఖ్య 1,571 (0.54%)బీకి పెరిగింది. కరోనా బారిన పడి తాజాగా 394 మంది కోలుకోగా మొత్తంగా ఇప్పటి వరకూ 2,84,611 మంది ఆరోగ్య వంతులయ్యారు. ఈ నెల 12 న రాత్రి 8 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. మహమ్మారి బారిన పడి ప్రస్తుతం 4,458 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది.

* నెల్లూరులోని ముఖ్యమంత్రి అమ్మఒడి సభకు వేల మంది హాజరయ్యారని, వీటికీ కరోనా అడ్డంకి రాదా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. దిల్లీలో ఉద్యమకారులకు సంఘీభావంగా 13న చట్టాల ప్రతులను భోగి మంటల్లో వేయడం, 16న చట్టాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, 21న విజయవాడలో సదస్సు, 26న ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని వివరించారు. సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యుడు జల్లి విల్సన్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు పి.హరనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

* భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు దేశంలో గత కొన్ని రోజులుగా 20 వేల లోపే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ నివేదిక ప్రకారం.. నిన్న దేశవ్యాప్తంగా 8,36,227 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 15,968 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి నాలుగు లక్షల 95వేలకు చేరింది. వీరిలో ఇప్పటివరకు 1,01,29,111 మంది కోలుకోగా, నిన్న ఒక్కరోజే 17,817 మంది డిశ్ఛార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 202 కొవిడ్‌ మరణాలు నమోదుకావడంతో మొత్తం మృతుల సంఖ్య 1,51,529కి చేరింది. ప్రస్తుతం 2,14,507 క్రియాశీల కేసులు(2.04శాతం) ఉన్నాయి.

* రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది అభివృద్ధి కోసమే కానీ అవినీతి చేయడం కోసం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పారదర్శకత కోసమే కొత్త మున్సిపల్‌ పన్నుల విధానాన్ని తీసుకొచ్చామన్నారు. విజయనగరంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు శాపనార్థాలే తమకు దీవెనలని బొత్స అన్నారు. ఆయన చేసిన తప్పులపై పశ్చాత్తాపం పడకుండా విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. ఇష్టారీతిన పన్నులు వేస్తూ ప్రజలను బాధిస్తున్నామని చంద్రబాబు చేసిన విమర్శలను మంత్రి కొట్టిపారేశారు. రాష్ట్రంలోని ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. విద్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులను తీసుకొస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చంద్రబాబుకి తగదన్నారు. ప్రజా శ్రేయస్సును కోరి కార్యక్రమాలను చేపడుతున్న నేపథ్యంలో అప్పులు పెరిగాయని.. ఇది ఎక్కడైనా సహజమేనని బొత్స వివరించారు.

* భోగి రోజున చిన్న పిల్లలకు భోగిపళ్లు పోయడం ఆనవాయితీ. బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు, అక్షింతలు కలిపి పిల్లల తలపై పోసి ఆశీర్వదిస్తారు. అయితే, భోగి సందర్భంగా వాడే భోగిపండ్లను గుంటూరు జిల్లాలోని చినకోండ్రుపాడు ప్రతీతి. ఇక్కడ 50 ఎకరాలకు పైగా నాటు రేగి తోటలు ఉన్నాయి. ఎర్రరేగడి నేలలు, కొండలతో కూడిన అటవీ ప్రాంతం వంటి అనుకూలతలతో గత నాలుగు దశాబ్దాలకుపైగా ఇక్కడ రేగి సాగవుతోంది. అయితే, సాధారణ రోజుల్లో వ్యాపారులు ఈ తోటల్లో కనిపిస్తే భోగి రోజు మాత్రం సామాన్యులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. భోగి కోసం స్వయంగా తోట వద్దే రేగిపళ్లను కొనుగోలు చేసి వాటితో భోగిపళ్లు పోయడం అలవాటని కొనుగోలుదారులు చెబుతున్నారు.

* భారత వైమానిక దళాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మన వాయుసేనను బలోపేతం చేయడమే లక్ష్యంగా రూ.48వేల కోట్లతో 83 తేజస్‌ (ఎల్‌సీఏ – లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌) ఫైటర్‌ జెట్‌ల కొనుగోలుకు ఆమోద ముద్రవేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫైటర్‌ జెట్‌ల కొనుగోలుకు తీసుకున్న నిర్ణయం దేశ రక్షణ రంగం స్వయం సమృద్ధికి దోహదం చేస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు.

* దా‘రుణ’ యాప్‌ల కేసులో రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. యాప్‌ నిర్వాహకులు రుణ గ్రహీతలను వేధిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ముంబయి కేంద్రంగా యాప్‌ నిర్వహిస్తూ, ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న చైనాకు చెందిన హి జియాంగ్‌ను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు. అతడితోపాటు అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వివేక్‌కుమార్‌నూ అరెస్టు చేసినట్లు చెప్పారు. ప్రధాన సూత్రధారి హి జియాంగ్‌ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. అరెస్టు చేసిన నిందితులిద్దరినీ మీడియా ముందు హాజరుపరిచిన సీపీ కేసు వివరాలు వెల్లడించారు.

* ప్రమాదకర ఆయుధాలతో పరాచకాలాడే ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నోట మరోసారి ప్రమాదకర మాట వెలువడింది. ఎప్పటిలాగే తమ దేశ అణ్వస్త్ర సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకుంటామని తెలిపారు. ఈ మేరకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పిలుపునిచ్చారు. అధికార వర్కర్స్​పార్టీ ముగింపు సమావేశం సందర్భంగా కిమ్‌ మరోసారి బుధవారం అణ్వాయుధాలపై మాట్లాడారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిన అవసరాన్ని కిమ్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

* కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను మొదట్లో వ్యతిరేకించిన సీఎం కేసీఆర్‌, దిల్లీ వెళ్లొచ్చాక యూటర్న్‌ తీసుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు భట్టి లేఖ రాశారు. విద్యుత్‌ చట్టాలపై చేసిన విధంగా సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని భట్టి డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ వ్యక్తిగత అవసరాల కోసం అన్నదాతల భవిష్యత్‌ను తాకట్టు పెట్టడం సరికాదని హితవు పలకారు. సాగు చట్టాలను కేంద్రం ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని భట్టి విజ్ఞప్తి చేశారు.

* ముఖ్యమంత్రి జగన్‌కు 91 సీఆర్పీసీ కింద నోటీసు ఇవ్వాలని తెదేపా పొలిట్‌బ్యూరో సబ్యుడు వర్ల రామయ్య ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు లేఖ రాశారు. లేఖతో పాటు సీఎం ప్రసంగం వీడియోను జత చేశారు.

* మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ వీసీ ఎండీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా, రహదారులు భవనాల శాఖలో ఆయన సేవల్ని వినియోగించుకునేందుకు బదిలీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ , స్టోర్స్‌ విభాగంలో కమిషనర్‌గా పనిచేస్తున్న ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ వీసీ ఎండీగా బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఠాకూర్‌ ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ, స్టోర్స్‌ విభాగం కమిషనర్‌గా గానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డిని ఆర్పీ ఠాకూర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్టీసీ వీసీఎండీగా నియమించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.