దా‘రుణ’ యాప్‌ల కేసులో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. యాప్ నిర్వాహకులు రుణ గ్రహీతలను వేధిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ముంబయి కేంద్రంగా యాప్ నిర్వహిస్తూ, ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న చైనాకు చెందిన హి జియాంగ్‌ను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. అతడితోపాటు అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వివేక్‌కుమార్‌నూ అరెస్టు చేసినట్లు చెప్పారు. ప్రధాన సూత్రధారి హి జియాంగ్ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. అరెస్టు చేసిన నిందితులిద్దరినీ మీడియా ముందు హాజరుపరిచిన సీపీ కేసు వివరాలు వెల్లడించారు. ‘‘కొన్ని రోజుల క్రితం ముగ్గురు నిందితులను అరెస్టు చేశాం. కేసు దర్యాప్తులో హి జియాన్ ప్రధాన సూత్రధారిగా తేలింది. వ్యాపార వీసాపై 2019లో జియాంగ్ భారత్ వచ్చాడు. ముంబయి కేంద్రంగా యాప్‌ల నిర్వహణ మొదలుపెట్టారు. తమ సంస్థల ద్వారా పెద్ద ఎత్తున 24 యాప్‌లు రూపొందించి భారీగా రుణాలు ఇచ్చారు. సులభ రుణయాప్‌ల ద్వారా వ్యాపారాన్ని విస్తరించారు. రుణాలు ఇచ్చాక 50 శాతం వడ్డీతో వసూలు చేస్తున్నారు. రుణాల బాధ్యత కాల్ సెంటర్లకు అప్పగించారు. కాల్ సెంటర్ల వేధింపులతో రుణ గ్రహీతలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఈ వేధింపులకు ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారు. రుణ యాప్‌లు 90 శాతం చైనా వాళ్లే నడిపిస్తున్నారు’’ అని సీపీ వెల్లడించారు.
దా”రుణా”ల చైనీయుడు అరెస్ట్
Related tags :