* ప్రముఖ ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్.. జేఈఈకి సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. అమెజాన్ అకాడమీ పేరిట ప్రారంభించిన ఈ వేదిక ద్వారా ఆన్‌లైన్ తరగతులు, స్టడీ మెటీరియల్స్ అందించనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా గణితం, రసాయనం, భౌతికశాస్త్రంపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించనున్నామని తెలిపింది.
* ఇటీవల కాలంలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న డిజిటల్ రుణాల దారుణాలను నివారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రంగంలోకి దిగింది. దీనిపై అధ్యయనం చేసేందుకు వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. రుణ యాప్‌లు, ఇతర డిజిటల్ రుణాలను ఈ గ్రూప్ పరిశీలిస్తుంది. అంతేకాకుండా, డిజిటల్ రుణాల లోటుపాట్లపై కూడా అధ్యయనం చేస్తుంది.
* ఆద్యంతం ఊగిసలాట మధ్య సాగిన దేశీయ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 24 పాయింట్లు నష్టపోయి 49,492 వద్ద ముగియగా నిఫ్టీ 1.40 పాయింట్ల లాభంతో 14,564 వద్ద స్థిరపడింది.
* రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ 350 ధరను పెంచారు. ఈ మోటర్ సైకిల్‌ను నవంబర్‌లో మార్కెట్లోకి విడుదల చేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ధరలు పెంచడం విశేషం. ఈ బైక్ మోడల్స్ ఫైర్‌బాల్, స్టెల్లర్, సూపర్ నోవా రకాల ధరలు పెరిగాయి. ఈ పెంపు రూ.2,927, రూ.3,010, రూ.3,146గా ఉండనుంది. కొత్త ధరల ప్రకారం ఫైర్‌బాల్ రూ.1,78,744, స్టెల్లర్ రూ. 1,84,377, సూపర్‌నోవా రూ.1,93,656గా నిర్ణయించారు. ఈ బైక్‌ను పూర్తిగా 350 సీసీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు.
* మ్యూచువల్ ఫండ్సులో కొత్త సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)ల రిజిస్ట్రేషన్లు 2020 డిసెంబర్‌లో 14 లక్షల 20 వేలకు పైగా పెరిగాయి.అయితే సిప్‌ల పెరుగుదలలో కొన్ని సాంకేతిక అంశాలు 2020 డిసెంబర్‌లో మెరుగైన పనితీరుకు దారితీసాయి.మ్యూచువల్ ఫండ్లలో కొత్త సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (పిస్)ల పెరుగుదలతో పాటు పెట్టుబడులు పెరిగాయి. భారతదేశ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో భారీ ప్రవాహాలకు ఈ సిప్‌లు కారణమయ్యాయి.అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (అమ్ఫీ) నుండి వచ్చిన సమాచారం ప్రకారం 2020 నవంబర్‌లో 10 లక్షల 6 వేల సిప్‌లు నమోదయితే, డిసెంబర్‌లో 14 లక్షల 20 వేలకు పైగా సిప్‌లు నమోదయ్యాయి. ఒక నెలలోనే సిప్‌లు 34% పెరిగాయి. అదే సమయంలో నిలిపివేయబడిన సిప్‌లు సంఖ్య నవంబర్‌లో 7,24,000 నుండి డిసెంబర్‌లో 7,76,000కు పెరిగింది.ఈ సిప్‌లు పెరుగుదల వలన మ్యూచువల్ ఫండ్సులో ప్రవాహాలు డిసెంబర్‌లో రూ. 8,418 కోట్లకు, నవంబర్‌లో రూ. 7,302 కోట్లు పెరిగాయి.
* దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు విక్రయ కంపెనీలు నేడు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం 25 పైసల మేర పెరిగాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.45కు చేరింది. డీజిల్ ధర రూ.74.38 నుంచి రూ.74.63కు పెరిగింది. ఈ పెంపుతో జయపురలో పెట్రో, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.91.85, డీజిల్ రూ.83.87గా ఉన్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.91.07కు చేరగా, డీజిల్ ధర రూ.81.34గా ఉన్నది. 2017, జూన్ 15 నుంచి చమురు కంపెనీలు పెట్రో ధరలను ప్రతి రోజు సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడమే దేశంలో ఇంధన ధరల పెంపునకు కారణమని చమురు విక్రయ సంస్థలు వెల్లడించాయి. 2020 మే నుంచి లీటర్ పెట్రోల్ ధర రూ.14.79, డీజిల్ రూ.12.34 పెరిగింది.