చివరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు నజఫ్ అలీ ఖాన్.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. నిజాం జువెలరీ ట్రస్ట్ ఆదాయ, సంపద పన్నుకు సంబంధించిన వివాదం 26 ఏళ్లుగా ఆదాయ పన్ను శాఖ దగ్గర పెండింగ్‌లో ఉన్నదని, దీనిని వెంటనే పరిష్కరించాలని ఆ లేఖలో ఆయన కోరారు. ఇప్పటికే ఇందులోని మొత్తం 114 లబ్ధిదారుల్లో 39 మంది చనిపోయారని, మిగిలిన వాళ్లలో చాలా మంది ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని ఆ లేఖలో నజఫ్ అలీ ఖాన్ చెప్పారు.
ఈ వివాదం ఎక్కడ మొదలైందో నజఫ్ ఆ లేఖలో వివరించారు. దాని ప్రకారం.. 1950లలో చివరి నిజాం కొన్ని ట్రస్ట్‌లను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి నిజాం జువెలరీ ట్రస్ట్. ఇందులోని నగలను అమ్ముకోవడానికి ట్రస్టీలైన ప్రిన్స్ ముఫఖమ్ జా, ప్రభుత్వం నామినేట్ చేసిన అధికారికి అధికారం కట్టబెట్టారు. 1995లో ఈ నగలను రూ.206 కోట్లకు కొనడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ మొత్తాన్ని నిజాం కుటుంబానికి చెందిన 114 మంది లబ్ధిదారులకు సమానంగా పంచారు. అయితే నగలను అప్పగించే సమయంలో తమకు రూ.30.50 కోట్ల ఆదాయ, సంపద పన్ను బాకీ ఉన్నదంటూ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చెప్పింది. ఆ మొత్తాన్ని ఆ రూ.206 కోట్ల నుంచే చెల్లించారు. ఈ మొత్తంలో రూ.15.45 కోట్లను బకాయిల కోసం చెల్లించగా.. వీటిలో చాలా వరకు రీఫండ్స్ రూపంలో వెనక్కి వచ్చింది. కానీ ఈ మొత్తాన్ని తప్పుడు అకౌంట్లలో వేశారు. ఇక మిగిలిన రూ.14.05 కోట్లను భవిష్యత్తులో పన్ను చెల్లించడం కోసం అప్పటి ఎస్‌బీహెచ్‌లో జమ చేసినట్లు ఆ లేఖలో నజఫ్ వెల్లడించారు. ఆ బకాయిలు, రీఫండ్స్‌కు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతోంది. ఆ రీఫండ్‌తోపాటు బ్యాంక్‌లో ఉంచిన రూ.14.05 కోట్లు కూడా నిజాం కుటుంబ లబ్ధిదారులకు పంచాల్సి ఉన్నా.. ఆదాయ పన్ను శాఖ మాత్రం పంచడం లేదని నజఫ్ తెలిపారు. తాము క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నా కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మాత్రం ఇంకా రూ.8.54 కోట్ల పన్ను బాకీ ఉన్నట్లుగా చెబుతున్నదని, ఇన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకోని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని నజఫ్ ఆ లేఖలో కోరారు.