Fashion

ఆ గోళ్లరంగుతో శాశ్వతంగా గోళ్ల ఆరోగ్యం నాశనం

ఆ గోళ్లరంగుతో శాశ్వతంగా గోళ్ల ఆరోగ్యం నాశనం

కొంతమంది అదేపనిగా గోళ్లకు రంగు వేస్తుంటారు. అది చెరిగిపోయేంత వరకు కూడా ఉండకుండా వెంటనే నెయిల్ పాలిష్ రిమూవర్‌తో తుడిచేసి వెంటనే మరో రంగును వేసేస్తారు. ముఖ్యంగా కాలేజీకి వెళ్లే అమ్మాయిలు ఇలా ఎక్కువగా చేస్తుంటారు. ఫ్యాషన్లనీ, వేసుకునే దుస్తులకు మ్యాచింగ్ అనీ, పార్టీలనీ.. ఇలా ఎప్పుడూ గోళ్లకు రంగు ఉండాల్సిందే.. ఇలా తరచూ చేయడం వల్ల గోళ్ల రంగు మారిపోతుంది. రంగు మారిన గోళ్లు తిరిగి కోలుకుని మామూలు గోళ్లలా రావడానికి కనీసం నాలుగు నుంచి తొమ్మిది నెలలు పట్టొచ్చు. కొన్నిసార్లు ఎర్రని గోర్లరంగు వేసుకున్నా కూడా గోళ్లు రంగు మారతాయి. మరికొన్నిసార్లు ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా రంగు మారవచ్చు. కానీ ఇలా గోళ్లు రంగుమారుతూనే వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. డాక్టర్ల సలహాలతో పాటు ఇంట్లోనూ కొన్ని వైద్య చిట్కాలను పాటిస్తే గోళ్లు సాధారణ స్థితికి చేరుకుంటాయి.
* గోళ్లకు నిరంతరంగా రంగు వేసుకోవడం మంచి పద్ధతి కాదు. వాటిల్లోని రసాయనాలు గోళ్లకే కాదు.. చుట్టూ ఉండే చర్మానికీ హాని కలిగిస్తాయి.
* ఎప్పుడూ గోళ్లను పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే రంగు మారిన గోళ్లు బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది.
* క్యూటికల్స్‌కి మాయిశ్చరైజర్, సహజ నూనెలతో రోజూ గోళ్లను మర్దన చేసుకోవాలి.
* మానిక్యూర్, పెడిక్యూర్ వంటివాటిని తరచూ చేసుకోకూడదు. తరచూ నెయిల్ పాలిష్ రిమూవర్లను కూడా వాడకూడదు. వాటివల్ల గోళ్ల చుట్టూ ఉన్న చర్మం పాడవుతుంది.
* గోళ్లని స్టైల్ కోసమని భిన్న ఆకృతుల్లో కత్తిరించుకుంటే ఎదుగుదల సరిగ్గా ఉండదు. వాటిని ఎప్పుడూ చివర్లనుంచి నీట్‌గా, సాధారణంగా కట్ చేసుకోవాలి.
* రోజూ తాజాపండ్లు, కూరగాయలను తీసుకోవాలి.
* గోళ్ల రంగుని ఎంచుకునేటప్పుడు అందులో విటమిన్ ఇ, మినరల్స్, బొటానికల్ ఎక్సాస్ట్ ఉన్నవాటిని ఎంచుకుంటే మంచిది.
* ప్రతిరోజూ తప్పనిసరిగా ఎస్‌పీఎఫ్ 30 ఉన్న హ్యాండ్ క్రీమ్‌ని రాసుకోవాలి.
* గోళ్ల రంగులో టాల్యూన్, ఫార్మాల్డిహైడ్, ఎసిటోన్, పారాబెంజ్ వంటి రసాయనాలు ఉంటాయి. టాల్యూన్ వల్ల గోళ్ల చుట్టూ ఉన్న చర్మం పొడిబారి పగిలిపోతుంది. కొన్నిసార్లు ఈ రసాయనాల వల్ల తలనొప్పి, వాంతులు, వికారం, ఇరిటేషన్, కళ్ల, గొంతు ఇన్‌ఫెక్షన్లు కలుగుతాయి.
* ఫార్మాల్డిహైడ్ వల్ల అలర్జిక్ రియాక్షన్లు వస్తాయి.
* ఎసిటోన్ తేమను దూరం చేస్తుంది.
* పారాబెంజ్ వల్ల కూడా కళ్ల అలర్జీలు వస్తాయి.
* కొన్ని రకాల గోళ్ల రంగుల్లో గ్లాసీలుక్ కోసం కర్పూరాన్ని వాడతారు. దీనివల్ల గోళ్లలోని తేమ ఆవిరైపోతుంది. ఆ వాసన పీల్చినా కూడా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈ గోళ్ల రంగు వేసుకున్న దాదాపు పద్నాలుగు గంటల తర్వాత ఈ ప్రభావం ఉంటుంది. అందుకే గోళ్ల రంగులను ఎంచుకునేటప్పుడు గ్లాసీ లుక్ లేనివి ఎంచుకుంటే బాగుంటుంది.
* టీపీహెచ్ అనే మరో రసాయనం వల్ల హార్మోన్ల అసమతుల్యత, సంతాన సాఫల్యలేమి బాధిస్తాయి. గోళ్ల రంగు వల్ల కూడా సంతానలేమి కలుగుతుందా.. అని ఆశ్చర్యపోనవసరం లేదు.. ఎందుకంటే ఎటువంటి రసాయనం, శరీరానికి ఏ రకమైన హాని చేస్తుందో తెలియదు కదా.