Food

కోడి పుంజు గెలిస్తే ధనం….ఓడితే భుక్తం

కోడి పుంజు గెలిస్తే ధనం….ఓడితే భుక్తం

పులి చచ్చినా పులే.. బతికినా పులే అన్నది నానుడి…! సంక్రాంతి పందెం కోళ్లకూ ఇప్పుడు ఈ సూత్రం వర్తిస్తోంది. పందెంలో గెలిచినా, ఓడినా పుంజు మీద మాత్రం రంజు….. తగ్గడం లేదు. ప్రత్యర్థిని పడగొట్టిన కోళ్లు పందెం సొమ్ము గెలిస్తే….ఓడిన కోళ్లు మాంసం ప్రియుల మనసు గెలుస్తున్నాయి. బరిలో చనిపోయిన పందెం పుంజులు….. మాంసం ప్రియుల నోరూరిస్తున్నాయి. ప్రాణాలు కోల్పోయాక కూడా… వేల రూపాయలు పలుకుతున్నాయి.
**ఈ కోడి భలే హాటు గురూ…..!కోడి.. కోడి.. నువ్వేం చేస్తావ్ అంటే.. ఉదయాన్నే కొక్కొరొకో అని కూస్తానంటుంది. కానీ… సంక్రాంతి పందెం కోళ్లు అలాకాదు.! తనను చంకలోపెట్టుకుని చంటిపిల్లాడిలా సాకిన యజమానికి కాసులు కురిపిస్తా అంటున్నాయి. అందుకే అవి 30 వేల నుంచి మొదలుకుని….లక్ష రూపాయల వరకూ పలుకుతుంటాయి. వాటిపై ఆశలుపెట్టుకున్న పందెంరాయుళ్లు….ఇక కన్నబిడ్డల్లా వాటినీ సాకుతారు. బాదం,పిస్తా, జీడిపప్పు వంటి ఎండుఫలాలేకాదు…. బరిలో తమ పౌరుషాన్ని నిలబెట్టే కోడిని మటన్‌, చికెన్‌ ఖైమా కూడా వేసి…. మేపుతారు. ఈతకొట్టిస్తారు. వ్యాయామేం చేయిస్తారు. మొత్తంగా బాగా బలిష్టంగా , ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తారు. అలాంటి పుంజుపై……లక్షల్లో పందేలు కాస్తుంటారు. యజమాని పౌరుషాన్ని నిలబెట్టాలని బరిలోకి దిగే కోళ్లలో ఒకటి విజయం సాధిస్తే.. మరొకటి కొట్లాడి కొట్లాడి.. పడిపోతుంది.
***కోస కోడికి పుల్ డిమాండ్బరిలో ప్రత్యర్థిని పడగొట్టే కోళ్లకే కాదు..పడిపోయిన కోళ్లకూ డిమాండ్‌ ఉంటుంది. పందెంలో ఓడిన కోడిని కోసకోడి అంటారు. సాధారణంగా రెండు నుంచి 3 కిలోల బరువుండే కోస కోడికూడా ఐదారు వేలదాకా పలుకుతోంది. పందేలు చూడడానికేకాదు…. పందెంలో చచ్చిన కోళ‌్లకోసమూ మాసం ప్రియులు పోటీపడుతుంటారు. ఐదువేలు పెడితే ఐదు కిలోల మటన్‌ వస్తుంది కదా….అని ప్రశ్నిస్తే.. ఆ టేస్టే వేరంటున్నారు.రుచి చూశారంటే..వదలరుపందెంలో దించే కోళ్ల జాతి రకాన్ని బట్టి వాటి విలువ ఉంటుంది. చచ్చిన కోళ్ల ధరలూవాటికి తగ్గట్లే ఉంటాయి. ఎంతైనా సరే పందెం కోడి కూర రుచి చూడాల్సిందే అని వెళ్లేవారు చాలా మంది ఉన్నారు. కొనుగోలు చేసిన కోడిని తీసుకెళ్లి….అక‌్కడే కమ్మని కూర చేయించుకుంటున్నారు. అలాంటి వారికోసం బరులవద్దే మంచిగా మసాలా దట్టించే….. తాత్కాలిక హోటళ్లూ వెలిశాయి. నాటు కోడి అందులోనూ బాగాగా మేపిన కోడిని కొనేందుకు ఎంతైనా వెనకడాడంలేదు.మొత్తానికి పందెంకోళ్లు చచ్చినా… బతికినా కాసులు కురిపిస్తున్నాయి. ప్రాణాలు విడిచినా పసందైన వంటకంగా జిహ్వచాపల్యాన్ని తీరుస్తున్నాయి.