క్యారెట్లు కళ్లకే కాదు, గుండెకూ మంచిదే. క్యారెట్లలోని బీటా కెరోటిన్ మన శరీరంలోకి చేరాక విటమిన్-ఏ గా మారుతుంది. ఈ విటమిన్ రక్తంలో చెడు కొవ్వులు పెరగకుండా అడ్డుకుని హృదయసంబంధిత వ్యాధులబారిన పడకుండా కాపాడుతుంది. అయితే, యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయ్‌కు చెందిన హ్యూమన్ న్యూట్రిషన్ విభాగం పరిశోధకులు గుండె ఆరోగ్యంలో బీటా కెరోటిన్‌ల పాత్ర గురించి చేసిన అధ్యయనంలో ఓ కొత్త విషయం తెలిసింది. మన శరీరం బీటాకెరోటిన్‌ని విటమిన్-ఏగా మార్చాలంటే ఓ ఎంజైమ్ కావాలి. అదే బీటా కెరోటిన్ ఆక్సిజెనేస్1 (బీసీఓ1). జన్యుపరంగా సంక్రమించే ఈ ఎంజైమ్ కొందరిలో చురుకుగా ఉండదట. అలాంటివారిలో క్యారెట్‌లోని బీటాకెరోటిన్‌ని విటమిన్-ఏ గా మార్చే శక్తి తక్కువ ఉంటుందట. 767మంది ఆరోగ్యవంతులైన యువత డీఎన్‌ఏ శాంపిళ్లను పరిశీలించగా బీసీఓ1 స్థాయులు ఎక్కువగా ఉన్నవారిలో చెడు కొలెస్టరాల్ స్థాయులు తక్కువగా ఉన్నాయని తేలిందంటారు ఇల్లినాయ్ పరిశోధకులు. మరో విషయం ఏంటంటే సగం జనాభాలో చురుగ్గాలేని బీసీఓ1 రకం ఎంజైమ్‌లే ఉంటున్నాయట. అలాంటివారు విటమిన్-ఏ కోసం పాలు, పెరుగు, చీజ్… లాంటి వాటిమీద ఆధారపడాల్సిందే. మొత్తంగా చెప్పేదేమంటే గుండె ఆరోగ్యానికి ఏ విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి, క్యారెట్‌తో పాటు ఏ విటమిన్ లభించే ఇతర పదార్థాలనూ ఆహారంలో చేర్చుకోవాలి.
క్యారెట్లతో చెడుకొవ్వు పరార్
Related tags :