Food

గోంగూరతో మటన్ కలిపితే…మస్త్ మజా!

గోంగూరతో మటన్ కలిపితే…మస్త్ మజా!

శాకంబరీ ప్రసాదంగా పేరుగాంచింది గోంగూర. పంటి కిందికి చేరగానే పుల్లపుల్లగా పలకరించే పుంటి కూరతో పచ్చడి మెతుకులు తిన్నా.. పరమానందమే. చేయి తిరిగిన పాకనిపుణుడు గోంగూర ఊరగాయ పెడితే, నోరూరడం ఖాయం. ఉల్లి, వెల్లుల్లి దట్టంగా వేసి దిట్టంగా ఉన్న ఎండు చేపలతో కూర వండితే అద్దిరిపోవాలంతే! పప్పు చేసినా, రకరకాల కూరల్లో జోడించినా పుంటికూర ఫ్లేవర్‌ ఆ పదార్థానికి కొత్త రుచినిస్తుంది.
*ఇక ఐతారం పూట, అదే పుంటికూరను మటన్‌తో కలిపి కొడితే.. జిహ్వ వహ్వా అనాల్సిందే. పోషకాల్లోనూ గోంగూర మటన్‌ గొప్పదే!గోంగూరలో క్యాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వారంలో ఒకసారైనా ఆహారంలో గోంగూర ఉండేలా జాగ్రత్త పడితే.. ఎముకలు దృఢంగా తయారవుతాయి. శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. రక్తహీనత తగ్గుతుంది.
*గోంగూర మటన్‌ విషయానికి వస్తే.. మటన్‌లో బి1,బి2 , బి3, బి9, బి12తో పాటు విటమిన్‌- ఇ,కె కూడా అపారం. అంతేకాదు, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇందులోని బి-12 శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తుంది, ఎర్ర రక్తకణాలను వృద్ధిచేస్తుంది. గర్భిణులు మటన్‌ తినడం వల్ల పుట్టబోయే బిడ్డలకు ఆరోగ్య సమస్యలు రావు.
*మటన్‌లో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు, దంతాలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ వాటిని దృఢంగా చేస్తుంది. బీ కాంప్లెక్స్‌, సెలీనియం, కొలీనియం ఉండటం వల్ల క్యాన్సర్‌ నుంచి తప్పించుకోవచ్చు. మటన్‌లో పొటాషియం తగిన మోతాదులో ఉండటం వల్ల రక్తపోటు, గుండెపోటు, కిడ్నీ సంబంధ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.
*ఏడాది పొడవునా అందుబాటులో ఉండే పుంటికూరతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అనేక దీర్ఘకాలిక రోగాలను నయం చేసే సత్తా ఇందులో ఉంది. పుంటికూరలో విటమిన్‌ సి, ఎ, బి6తో పాటు ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు.. రకరకాల అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టే శక్తి పుల్లపుల్లని గోంగూరలో ఉందంటున్నారు నిపుణులు.
*రక్తంలో ఇన్సులిన్‌ స్థాయిని పెంచి, షుగర్‌ లెవెల్స్‌ని తగ్గించే శక్తి గోంగూరకు ఉంది. కాబట్టి, మధుమేహ బాధితులు పుంటి కూరతో షుగర్‌ను నియంత్రించుకోవచ్చు. అంతేకాదు నేత్ర సమస్యలకు, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులకు, కొన్ని రకాల క్యాన్సర్‌లకు పుంటికూర మందులా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.