మరణం యముడి చేతిలో కూడా లేదు. అవును. విష్ణువుని కలుసుకోవటానికి యమధర్మరాజు వైకుఠo వెళ్లినప్పుడు గుమ్మం దగ్గర గరుత్మంతుడు ఒక చిన్న పక్షితో కబుర్లు చెపుతూ ఉన్నాడు. లోపలకి వెళుతూ యముడు పక్షి వైపు అదోలా చూశాడు. ఆ చూపుకి బెదరిన పక్షిని గరుత్మంతుడు తన భుజాల మీద ఎక్కించుకున్నాడు. మనసుకన్నా వేగంగా పయనిoచగలడని పక్షిరాజుకి పేరున్నది. క్షణకాలంలో కొన్ని వేల లక్షల యోజనాల దూరంలో ఒక పర్వతాంతర్భాగపు గుహలో దాచి, అడ్డుగా ఎవరూ తొలగించలేని ఒక పెద్ద రాతిని అడ్డుగా పెట్టి వెనక్కి వచ్చాడు. ఈలోపులో విష్ణువుతో మాట్లాడిన యముడు బయటికి వచ్చి గరుత్మంతుణ్ణి చూసి “నీ పక్కన ఆ పక్షి ఏది?” అని అడిగాడు. “నీ గర్వం అణచటానికి, కొన్ని వేల యోజనాల దూరంలో ఎవరికీ అందని చోట దాచాను” అన్నాడు గరుత్మంతుడు. “అయ్యో! అలా చేశావా? నీ పక్కనే ఉన్న పక్షి మరణం, మరికొన్ని క్షణాల్లో ఎక్కడో కొన్ని వేల యోజనాల దూరంలో పర్వతగుహలో పెద్ద బండరాయి పడి సంభవిస్తుంది అని వ్రాసి ఉంటే, ‘ఇదేమిటి ఈ పక్షి ఇక్కడ ఉంది. ఇంత చిన్న పక్షి క్షణాల్లో అంత దూరం ఎలా వెళ్తుంది? ఇదెలా సాధ్యం?’ అనుకుoటూ దాన్ని చూసాను. ఇదా నువ్వు చేసిన పని?” అన్నాడు యముడు.
మరణం యముడి చేతిలో కూడా లేదు.
Related tags :