Politics

గుజరాత్‌కు 8 హైస్పీడ్ రైళ్లు…చప్పట్లు కొట్టండి

గుజరాత్‌కు 8 హైస్పీడ్ రైళ్లు…చప్పట్లు కొట్టండి

దేశంలో హైస్పీడ్‌ (అధిక వేగ) రైళ్లను ప్రవేశపెట్టే దిశగా దూసుకువెళ్తున్నామని, రైలు పట్టాల వ్యవస్థను దానికి తగ్గట్టు అంచెలంచెలుగా మెరుగుపరుస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. గుజరాత్‌లో సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌పటేల్‌ ఐక్యత విగ్రహం నెలకొల్పిన కేవడియాకు అనుసంధానమయ్యేలా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నడిచే ఎనిమిది రైళ్లను ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జెండాఊపి ప్రారంభించారు. మూడు రైల్వేస్టేషన్లను, దభోయీ-కేవడియా బ్రాడ్‌గేజ్‌ మార్గాన్ని కూడా ప్రారంభించారు. ఒకే గమ్యానికి ఎనిమిది రైళ్లను ఒకేసారి ప్రవేశపెట్టడం బహుశా ఇదే మొదటిసారి అయి ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. ‘‘2006 నుంచి 2014 మధ్య సరకు రవాణా ప్రత్యేక నడవా పనులు కేవలం కాగితాలపైనే కనిపించేవి. కిలోమీటరు పని కూడా పూర్తికాలేదు. గతంలో పనులు ఎలా జరిగేవో చెప్పడానికి ఇదో ఉదాహరణ. మరికొద్ది నెలల్లోనే నడవాలకు సంబంధించి 1100 కి.మీ. పనులు పూర్తి కాబోతున్నాయి. రైల్వేపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఇటీవలి ఏళ్లలో ఊహకందని స్థాయిలో పనులు జరిగాయి. తయారీ, సాంకేతిక రంగాల్లో రైల్వే స్వావలంబనపై దృష్టి సారించాం. అధిక అశ్వశక్తి ఉన్న రైలింజన్ల తయారీని చేపట్టకపోయి ఉంటే దేశంలో తొలి డబుల్‌ డెక్కర్‌ కంటెయినర్‌ రైలును నడపడం సాధ్యమయ్యేదా?’’ అని ప్రధాని ప్రశ్నించారు. తన చిన్నతనంలో బరోడా (వడోదరా) నుంచి దభోయీ మధ్య నేరోగేజ్ మార్గంలో అత్యంత నెమ్మదిగా నడుస్తుండే రైలు గురించి మోదీ గుర్తు చేసుకున్నారు. తాను ఆ రైల్లో ప్రయాణించేవాడినని, ఎక్కడ కావాలంటే అక్కడ రైలును అందుకోవడం, దిగడం వీలయ్యేదని చెప్పారు. కొన్నిసార్లు ఈ రైలు కంటే పాదచారులు వేగంగా వెళ్లిపోతుండేవారని తెలిపారు. సందర్శకుల సంఖ్య పరంగా అమెరికాలో సుప్రసిద్ధ ‘స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ’ని కేవడియాలోని ఐక్యత విగ్రహం త్వరలోనే అధిగమిస్తుందని మోదీ చెప్పారు. 2018లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాక ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది దీనిని సందర్శించారని, కరోనా కాలంలోనూ ఈ సంఖ్య వేగంగా పెరుగుతూ వచ్చిందని తెలిపారు. సమీప భవిష్యత్తులో రోజుకు లక్ష మందికి పైగా సందర్శకులు ఈ ప్రదేశానికి వస్తారని ఒక సర్వేలో తేలినట్లు వెల్లడించారు.