ఏపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.
ఏపీలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.
అదే విధంగా పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి రెండు పూటలా తరగతులు జరగనున్నాయి.
వీరికోసం ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
10వ తరగతి విద్యార్థులకు రోజుకు 8 పీరియడ్లు నిర్వహిస్తారు.
ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20గంటల వరకూ తరగతులు జరుగుతాయి. జాతీయ, ఇతర పండుగలు మినహా ఆదివారాల్లో కూడా తరగతులు నిర్వహిస్తారు.
ఆదివారం ఒక పూట ఒక సబ్జెక్టులో మాత్రమే తరగతులు జరుగుతాయి.
అన్ని పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ ప్రణాళికను అమలు చేయాలని డీఈవో సుబ్బారావు ఆదేశించారు.
అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సర తరగతులు కూడా సోమవారం నుంచే ప్రారంభం కానున్నాయి.
రేపటి నుంచి ఆరో తరగతి క్లాసులు…..ఇంటర్‌కు 106 పనిదినాలు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి క్లాసులు సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు డీఈవో సుబ్బారావు తెలిపారు.
వీరికి రోజుమార్చి రోజు తరగతులు నిర్వహిస్తారన్నారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతున్నాయి.
అందుకు సంబంధించి ఇంటర్ బోర్డు సవరించిన వార్షిక క్యాలెండర్‌ను ప్రకటించింది.
ఆ ప్రకారం 106 పని దినాలు ఉంటాయి. మే 31 వరకూ తరగతులు జరుగుతాయి.
రెండో శనివారం కూడా కళాశాలలు నడుస్తాయి. వేసవి సెలవులను కూడా రద్దు చేశారు.
2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ తీవ్ర ఇబ్బందులకు గురయిన సంగతి తెలిసిందే.
విద్యా సంవత్సరాన్ని రద్దు చేస్తే, విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందికరమని భావించిన ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలను విరమించుకున్నాయి.
అదే సమయంలో ఆన్ లైన్ క్లాసులను ప్రోత్సహించాయి, ప్రైవేటు స్కూళ్లే కాదు, ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆన్ లైన్ బాట పట్టాయి.
టీవీల్లోనూ పాఠాలను బోధించే ప్రక్రియను ప్రారంభించారు.
కరోనా కాస్త నెమ్మదించిన తర్వాత ఇటీవలే స్కూళ్లను ప్రారంభించారు. స్కూళ్లలో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.
విద్యార్థులను షిఫ్టుల వారీగా స్కూళ్లకు రప్పించేలా చేశారు.
కొవిడ్ టీకా కూడా రావడంతో రానున్న విద్యా సంవత్సరంలోనైనా మునుపటిలా క్లాసులు జరుగుతాయన్న ఆశాభావాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు.