ScienceAndTech

మీరు శృంగారంలో ఎప్పుడు పాల్గొంటారో ముందే పసిగడుతున్నాయి

మీరు శృంగారంలో ఎప్పుడు పాల్గొంటారో ముందే పసిగడుతున్నాయి

శృంగారంలో ఎప్పుడు పాల్గొంటున్నారో కూడా ఫేస్‌బుక్‌కు తెలిసిపోతోంది’

కొన్ని యాప్‌లను వినియోగిస్తున్నవారి సున్నితమైన వ్యక్తిగత సమాచారం కూడా ఫేస్‌బుక్‌కు చేరుతోందని ప్రైవసీ ఇంటర్నేషనల్ (పీఐ) అనే సంస్థ వెల్లడించింది. వ్యక్తులు ఎప్పుడు శృంగారంలో పాల్గొంటున్నారన్న వివరాలూ అందులో ఉంటున్నాయని తెలిపింది.

నెలసరి వివరాలు నమోదు చేసుకునేందుకు మహిళలు ఉపయోగించే కొన్ని పీరియడ్ ట్రాకింగ్ యాప్‌ల ద్వారా ఫేస్‌బుక్‌కు ఈ సమాచారం చేరుతున్నట్లు పీఐ పేర్కొంది.

వివిధ పీరియడ్ ట్రాకింగ్ యాప్‌లపై అధ్యయనం చేసి ఆ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది.

సాధారణంగా పీరియడ్ ట్రాకింగ్ యాప్‌లు చాలా సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని వినియోగదారుల నుంచి సేకరిస్తుంటాయి. శృంగారంలో పాల్గొన్న సమయం, పాటించిన గర్భ నిరోధక విధానం, పీరియడ్ వచ్చే తేదీ వంటి వివరాలు అడుగుతాయి.

ఈ సమాచారం ఆధారంగా ఎప్పుడు శృంగారంలో పాల్గొంటే గర్భం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, తదుపరి నెలసరి ఎప్పుడు రావొచ్చు లాంటి విషయాలను అంచనా వేసి ఆ యాప్‌లు చెబుతుంటాయి.

అయితే, కొన్ని యాప్‌లు ఫేస్‌బుక్‌ అందించే సాఫ్ట్‌వేర్ డెవెలప్‌మెంట్ కిట్ (ఎస్‌డీకే) టూల్స్‌ను వినియోగిస్తుంటాయి. వీటి ద్వారా అడ్వర్టైజర్స్‌ను పొందడంతోపాటు వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లు యాడ్‌లు చూపించొచ్చు.

ఈ ఎస్‌డీకే ద్వారానే సున్నితమైన సమాచారం ఫేస్‌బుక్‌కు చేరుతున్నట్లు పీఐ తెలిపింది.

పీరియడ్ ట్రాకర్, పీరియడ్ ట్రాక్ ఫ్లో, క్లూ పీరియడ్ ట్రాకర్ లాంటి పాపులర్ యాప్‌లు ఫేస్‌బుక్‌కు ఎలాంటి సమాచారమూ ఇవ్వట్లేదు.

మాయా (గూగుల్ ప్లేలో 50 లక్షల సార్లు డౌన్‌లోడ్ అయ్యింది), ఎమ్ఐఏ (10 లక్షల డౌన్‌లోడ్లు), మై పీరియడ్ ట్రాకర్ (10 లక్షల డౌన్‌లోడ్లు) యాప్‌లు మాత్రం ఫేస్‌బుక్‌తో సమాచారం పంచుకుంటున్నాయి.

”వ్యక్తుల ఆరోగ్యం, శృంగార జీవితం గురించిన సున్నితమైన సమాచారాన్ని ఫేస్‌బుక్‌ సహా ఇతర థర్డ్ పార్టీలతో ఈ యాప్‌లు పంచుకుంటున్నాయి. వినియోగదారుల నుంచి పారదర్శక రీతిలో దీనిపై అంగీకారం తీసుకోవడం లేదు” అని పీఐ పేర్కొంది.

ఈ అధ్యయన ఫలితాలపై మాయా యాప్ స్పందించింది. ఫేస్‌బుక్ కోర్ ఎస్‌డీకే, అనలిటిక్స్ ఎస్‌డీకేలను తమ యాప్ నుంచి తీసివేశామని, మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని పీఐకి వివరణ ఇచ్చింది.

అంగీకారం తెలిపిన వినియోగదారుల విషయంలో ఫేస్‌బుక్ యాడ్స్ ఎస్‌డీకేను వినియోగిస్తామని.. అయితే, సున్నితమైన వ్యక్తిగత సమాచారం మాత్రం పంచుకోమని ప్రకటించింది.

”నెలసరి అన్నది చాలా సంక్షిష్టమైన అంశం. మాయా సేకరించే సమాచారం అంతా వినియోగదారులకు మెరుగ్గా సేవలందించేందుకు అవసరమయ్యేదే. వినియోగదారులందరికీ మా షరతులు, నిబంధనలు ముందుగానే తెలియపరుస్తాం. వాళ్ల డేటాను వినియోగదారులు ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు” అని మాయా యాప్ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.

ఎమ్ఐఏ, మై పీరియడ్ ట్రాకర్ తమ స్పందనలను ప్రచురించేందుకు బీబీసీకి అనుమతి ఇవ్వలేదు.

మరోవైపు ఫేస్‌బుక్ కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చింది.

”ఆరోగ్యం లాంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని డెవెలపర్స్ మాకు పంపకూడదని నిబంధనలు ఉన్నాయి. అలా జరుగుతున్నట్లు తెలిస్తే మేమే అడ్డుకుంటాం. మిగతా యాప్‌లు, వెబ్‌సైట్‌లను వ్యక్తులు ఎలా వినియోగిస్తున్నారన్న సమాచారాన్ని మేం యాడ్స్ విషయంలో ఉపయోగించుకోం” అని తెలిపింది.

ఫేస్‌బుక్‌కు యాప్‌లు, ఇతర వేదికల నుంచి చేరే సమాచారాన్ని నియంత్రించుకునేలా వినియోగదారుల కోసం ఓ టూల్‌ను తెస్తామని ఇటీవల ఆ సంస్థ ప్రకటించింది.