చలికాలంలో పొద్దున్నే త్వరగా లేవాలనిపించదు. సాయంత్రం త్వరగా ముసుగుతన్ని పడుకోవాలనిపిస్తుంది. దీనిక్కారణం ఈకాలంలో మన శరీరం నిద్ర హార్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి చెయ్యడమేనట. ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు చెప్పేదేంటంటే చలికాలంలో పగటి సమయం తక్కువ ఉండేసరికి సూర్యరశ్మి సరిగా అందక శరీరం మెలటోనిన్‌ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందట. ఇది నిద్రను బాగా ప్రేరేపిస్తుంది. నిద్ర హార్మోనుగా పేర్కొనే మెలటోనిన్ ఆకలినీ పెంచుతుందట. చలిని తట్టుకునేందుకు శరీరం వేడిని పుట్టించాలన్నా ఎక్కువ శక్తి కావాలి. దాంతో ఎక్కువగా తింటాం. అది కూడా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి, వేడిగా స్పైసీగా ఉండే ఆహారాన్ని తినాలనిపిస్తుంది. ఇక, మిగిలిన రోజుల్లో ఉదయమే వాకింగ్‌కి వెళ్లేవాళ్లు కూడా ఈ కాలంలో బద్ధకించి ముసుగుతన్ని పడుకుంటారు. ఇంకేముందీ… అన్నీ కలసి చలికాలం ముగిసే సరికి చాలామంది ఒకటి నుంచి మూడు కిలోల బరువు పెరుగుతారని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే, ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే పప్పుధాన్యాలూ కూరగాయలను తీసుకుంటూ ఒకే చోట కూర్చోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే బరువుని కొంతవరకూ అదుపులో ఉంచొచ్చు అంటున్నారు వైద్యులు.
చలికాలం బరువు ఎందుకు పెరుగుతారు?
Related tags :