WorldWonders

అక్కడ కూయ్ కయ్ అంటేనే పలుకుతారు

అక్కడ కూయ్ కయ్ అంటేనే పలుకుతారు

రామారావు.. విజయ్‌.. అరుణ.. ప్రియ.. నాని.. మన దగ్గర పేర్లు అంటే ఇలా ఉంటాయ్‌ కదా! కానీ మేఘాలయలోని ఓ గ్రామంలో ప్రజలు ఒకరినొకరు కూని రాగాలతో పిలుచుకుంటారు. అక్కడి వారికి పేర్లు ఉండవు. రాగాలతోనే పిలుపులు.. పలకరింపులు ఉంటాయి. ఎందుకంటే.. అది వారి ఆచారం. విచిత్రంగా ఉంది కదా! మరి ఆ ఆచారం గురించి మరింత తెలుసుకుందాం పదండి..
*మేఘాలయలోని ఓ మారుమూల గ్రామం కాంగ్‌థాంగ్‌. ఇక్కడ 200 వరకు ఇళ్లు.. 700కుపైగా జనాభా ఉంటుంది. ఇక్కడ మనుషుల్ని పేర్లకు బదులు కూని రాగాలతో పిలుస్తుంటారు. ఈ గ్రామంలో పుట్టిన బిడ్డకి విజిల్‌ వేస్తూ, పక్షుల అరుపును అనుకరిస్తూ.. సినిమా పాటల్లోని ట్యూన్‌ను హమ్‌ చేస్తూ పేర్లు పెడతారు. వీటిలో పదాలు ఉండవు.. కేవలం రాగాలే. ఒక్కో పేరు, అదేనండీ.. ఒక్కో కూని రాగం 30 సెకండ్ల నిడివి ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఆరు సెకన్ల నిడివితో పిలిస్తే… అడవిలో వేట / పనికి వెళ్తే పూర్తి నిడివి రాగంతో పిలుస్తారట.
*పుట్టిన బిడ్డకు రాగంతో పేరు పెట్టడానికి భారీ కసరత్తే జరుగుతుంది. తల్లి, తండ్రి వేర్వేరుగా ఓ రాగాన్ని సృష్టించి/ఎంచుకొని ఆలపిస్తారు. అందులో ఏది బాగుందో అది పెడతారు. ఇక్కడ ఎవరూ ఒకరిని పిలిచిన కూనిరాగంతో మరొకరిని పిలవరు. పేర్లు గుర్తుపెట్టుకున్నట్టే.. రాగాలను గుర్తుపెట్టుకుంటారు. ఇలా రాగాలతో పేరు పెట్టే పద్ధతిని జింగవా యోబి అని పిలుస్తారట. అంటే, అమ్మ ప్రేమ అని అర్థం.
*ఈ పద్ధతిలో పేర్లు పెట్టడానికి ఓ కారణముంది. ఈ ప్రాంతానికి చెందినవారి పూర్వీకులకు మూఢ నమ్మకాలెక్కువ. అడవిలో వేటకు వెళ్లినప్పుడు దెయ్యాల నుంచి తప్పించుకోవడం కోసం ఇలా కూని రాగాలతో పిలుచుకునేవారట. ఒకవేళ పేరు పెట్టి పిలిస్తే.. దెయ్యాలు వారిని గుర్తు పట్టి చంపుతాయని భావించేవారట. అందుకే, వారిని దెయ్యాలు గుర్తుపట్టకుండా ఉండటం కోసం పేర్లకు బదులు ఈ కూని రాగాలను ఎంపిక చేసుకున్నారు. అలా ఇది ఆచారంగా మారిపోయిందని గ్రామ ప్రజలు చెబుతున్నారు. అయితే కాలంతో పాటు వారూ మారుతున్నారు. చిన్నారులు, యువకులు చదువుకోవడం.. సమీప పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తుండటంతో ప్రస్తుతం వారికంటూ ఓ పేరును పెట్టుకుంటున్నారు. పుట్టే బిడ్డలకు కూడా పేర్లు పెడుతున్నారు. కానీ ఇంట్లో.. గ్రామంలో ఉన్నప్పుడు మాత్రం వారిని కూని రాగాలతోనే పిలుస్తారట.