* వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా కన్నీటి పర్యంత మయ్యారు. తిరుపతిలో జరిగిన ఎపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గన్న ఆమె… అధికారులు తన మాట వినడం లేదని, తనను పట్టించుకోవడం లేదని…కనీసం మర్యాద ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజక వర్గ సమస్యలు, ప్రొటోకాల్ విషయంలో అధికారుల తీరుపై కమిటీకి ఫిర్యాదు చేశారు. నగరిలో టిటిడి ఉద్యోగుల ఇళ్ల స్థలాల సమావేశానికి సంబంధించి అధికారులు తనకు సమాచారం ఇవ్వలేదని వాపోయారు.
* బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. ఆమెపై అదనపు సెక్షన్లు నమోదుచేసినట్లు పోలీసులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో అఖిలప్రియ సహా ఇప్పటివరకు 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిలప్రియ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశముందని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
* ఏపీ సీఎం జగన్ రేపు దిల్లీ వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకరించాలని కేంద్రాన్ని జగన్ కోరనున్నారు. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. దీనితో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపైనా అమిత్‌షా సహా కేంద్రమంత్రులతో జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
* ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ ఆర్పీ ఠాకూర్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు ఆయణ్ని కలిసి అభినందనలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఎండీ ఆర్పీ ఠాకూర్ సమావేశం కానున్నారు. బస్సుల నిర్వహణ, సంస్థ ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపరమైన అంశాలపై సమీక్షించనున్నారు.
* పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై హైకోర్టులో ఇవాళ్టి విచారణ ముగిసింది. తదుపరి విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్, ఎస్‌ఈసీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. పంచాయతీ ఎన్నికల సమయం ముగిసి ఇప్పటికే రెండున్నరేళ్లు పూర్తయిందని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రభుత్వం చెబుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎన్నికల నోటిఫికేషన్ ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
* అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నందిగ్రామ్ స్థానం నుంచి తాను పోటీ చేయనున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన కొద్ది సేపటికే.. భాజపా నేత సువేందు అధికారి తనదైన శైలిలో స్పందించారు. నందిగ్రామ్‌లో ఆమెను 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ స్థానంలో బెనర్జీని ఢీకొట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు అధికారి ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం కోల్‌కతాలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వెల్లడించారు.
* పశ్చిమబెంగాల్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్, భాజపా మధ్య మరోసారి ఘర్షణ తలెత్తింది. కోల్‌కతాలో భాజపా చేపట్టిన రోడ్ షో హింసాత్మక ఘటనలకు వేదికగా మారింది. ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నట్టు తెలుస్తోంది. ఈ ర్యాలీలో కేంద్రమంత్రి దేవశ్రీ చౌధురి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, మాజీ మంత్రి సువేందు అధికారి పాల్గొన్నారు. ఈ దాడిని ప్రజాస్వామ్యంపై ప్రత్యక్షంగా జరిగిన దాడిగా పేర్కొంటూ భాజపా బెంగాల్ శాఖ ఈ ఘటన వీడియోను విడుదల చేసింది.
* విజయనగరం జిల్లా పాచిపెంట ఎస్సై రమణపై ఇద్దరు యువకులు దాడికి పాల్పడ్డారు. శివన్నపేటలోని అత్తగారింటికి వెళ్లిన ఎస్సై.. తిరిగి సాధారణ దుస్తుల్లో బయల్దేరారు. ఈ క్రమంలో ఖడ్గవలస వద్ద బైక్‌పై చంద్రశేఖర్, సుధాకర్ వేగంగా వెళ్తుండగా వారిని వద్దని వారించినందుకు యువకులు ఎస్సైపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. యువకులను అదుపులోకి తీసుకున్నామని.. వారికి గతంలో నేర చరిత్ర ఉంటే రౌడీషీట్ తెరుస్తామని చెప్పారు.
* కేపీహెచ్‌బీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే.. కుమారుడికి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్‌కు చెందిన బాలు అనే వ్యక్తి కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ పాఠశాల ఆవరణలో గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నాడు. అతడి భార్య అదే పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తోంది. వీరి చిన్న కుమారుడు చరణ్ (12) ఆ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.
* కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం మళ్లీ రాజుకుంది. కర్ణాటకలో ఉన్న బెళగావి..తదితర ప్రాంతాలను తిరిగి సాధిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించడం వివాదానికి తెరతీసింది. ఈ ప్రకటనను కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తీవ్రంగా ఖండించారు. ఇది చాలా దురదృష్టకరమన్న యడ్డీ.. తమ రాష్ట్రంలోని అంగుళం భూమిని కూడా వదులుకోబోమని మరోసారి స్పష్టం చేశారు.
* చైనాలో పుట్టి ప్రపంచదేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి ప్రతిచోటా కల్లోలం సృష్టించింది. అనేక రంగాలను ఛిన్నాభిన్నం చేసింది. అన్ని దేశాల వృద్ధిరేటుపై గట్టిదెబ్బ కొట్టింది. కరోనా కారణంగా ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. అయితే, ఇలాంటి సమయంలో మహమ్మారి పుట్టినిల్లయిన చైనా ఆర్థిక వ్యవస్థ మాత్రం పుంజుకోవడం గమనార్హం. 2020లో ఆ దేశ జీడీపీ 2.3శాతం పెరిగింది. ఈ మేరకు చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్(ఎన్‌బీఎస్) సోమవారం డేటా విడుదల చేసింది.
* సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు, పలు పోటీ పరీక్షలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కీలక ప్రకటన చేశారు. సీబీఎస్‌ఈ పరీక్షలతో పాటు జేఈఈ మెయిన్, నీట్ వంటి పోటీ పరీక్షలు తగ్గించిన సిలబస్‌తోనే ఉంటాయని స్పష్టంచేశారు. సోమవారం కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులతో నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. దేశంలో కరోనా భయం నెలకొన్న వేళ పరీక్ష కేంద్రాలకు వెళ్లడంపై ఓ విద్యార్థి ఆందోళన వ్యక్తంచేస్తూ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. పరీక్షలు చుట్టూ ఉన్న అంశాలపై భయపడాలి గానీ.. పరీక్షా కేంద్రాలకు వెళ్లడంపై ఆందోళనే అవసరం లేదని భరోసా ఇచ్చారు. గతేడాది నీట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని ఆయన గుర్తుచేశారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రానికి వెళ్లడంపై ఎలాంటి టెన్షన్ అవసరం లేదన్నారు. నూతన జాతీయ విద్యా విధానం -2020, పరీక్షలు, పాఠశాలల పునఃప్రారంభం తదితర అంశాలపై ఆయన విద్యార్థులతో చర్చించారు.
* రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో పాన్‌ఇండియా చిత్రంగా ‘ఆదిపురుష్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే జనవరి 19వ తేది ఉదయం 7.11నిమిషాలకు ‘ఆదిపురుష్’కు సంబంధించి కీలకమైన సమాచారాన్ని చితృబృందం చెప్పబోతునట్టు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇందుకు కారణం చిత్ర నిర్మాత రాజేష్‌నాయర్ తన ట్విట్టర్ ఖాతాలో దేవుని చిత్రపటం ఉంచి ‘ఆది పురుష్’అని హ్యాష్‌ట్యాగ్ ఇవ్వడమే. చిత్రబృందం అందరితో కలిసి పూజా కార్యక్రమం నిర్వహించేందుకు ఇప్పటికే నిర్మాణ సంస్థ అంతా సిద్ధం చేసింది. దీంతో ప్రభాస్ అభిమానులు సినిమాకు సంబంధించి కీలక సమాచారం రావొచ్చునని భావిస్తున్నారు. ‘తానాజీ’ వంటి చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సినిమాను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 3డీలో తెరకెక్కబోయే ఈ పౌరాణిక చిత్రంలో ప్రభాస్ శ్రీరామునిగా, సైఫ్ అలీఖాన్ రావణబ్రహ్మగా కనిపించబోతున్నారని ఇప్పటివరకు ఉన్న సమాచారం. అయితే ప్రస్తుతం ప్రభాస్ ‘రాథేశ్యామ్’సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటూనే, ‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌తో కలిసి‘సలార్’అనే చిత్రానికి సంబంధించి పూజా కార్యాక్రమాన్ని పూర్తిచేశారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నారు.
* ఏపీలో కొత్తగా 81 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 27,861 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,86,066కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ విశాఖపట్నం జిల్లాలో ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 7,141కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 263 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,713 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,26,04,214 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
* తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో టీమ్‌ఇండియా క్రికెటర్ హనుమ విహారి భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమ విహారిని కేటీఆర్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా విహారి.. బ్యాట్‌ను కేటీఆర్‌కు అందజేశారు. అనంతరం ఇరువురూ క్రికెట్ సంబంధిత అంశాలపై కాసేపు చర్చించుకున్నారు.
* పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల పనితీరుతో అద్భుత ఫలితాలు వస్తున్నాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యుత్ ఇంజినీర్ల సంఘం డైరీ, క్యాలెండర్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ప్రగతిభవన్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. ఉద్యమ సమయంలో ఉద్యమనేతగా కేసీఆర్ ఇచ్చిన 24గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ హామీని నెరవేర్చడంలో ఆ సంస్థల యాజమాన్యాలు, సిబ్బంది తోడ్పాటు ఉందన్నారు. సాధక బాధకాలు తెలిసిన వారికే యాజమాన్య బాధ్యతలు అప్పగించడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని సీఎం కేసీఆర్ రుజువు చేశారన్నారు. సీఎం ఆలోచనల మేరకు రాష్ట్రంలో వెలుగులు విరజిమ్ముతున్న విద్యుత్ శాఖ మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఆకాంక్షించారు.
* అలిపిరి కాలినడక మార్గంలో నాగుపాము భక్తులను పరుగులు పెట్టించింది. అటవీ ప్రాంతం నుంచి మెట్లపైకి వచ్చిన పాము.. పడగ విప్పి బుసలు కొడుతూ యాత్రికులను భయభ్రాంతులకు గురిచేసింది. పాములు పట్టే భాస్కర్ నాయుడు అనే వ్యక్తి సమాచారం అందుకుని ఘటనాస్థలికి వచ్చారు. అనంతరం ఆయన చాకచక్యంగా సర్పాన్ని పట్టుకున్నాడు. దానికి ఎలాంటి హాని జరగకుండా సంచిలో వేసుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
* ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీ ఏర్పాటు ఆలోచన విరమించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీ మక్కళ్‌మండ్రం సభ్యులు ఇతర పార్టీల్లో నిరభ్యరంతంగా చేరొచ్చని టీమ్ రజనీ వెల్లడించింది. సోమవారం కొందరు రజనీ మక్కళ్ మండ్రం జిల్లా అధ్యక్షులు తమిళనాడు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే పార్టీలో చేరడంతో రజనీ బృందం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇతర పార్టీల్లో చేరినప్పటికీ వారు రజనీ అభిమానులేనన్న విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు.’’ అని రజనీ అభిమానుల వేదిక పేర్కొంది. కొన్ని నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో రజనీకాంత్ భాజపాకు తన మద్దతునిస్తారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
* నెల్లూరు జిల్లా ఎస్పీపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పని చేసినంత కాలం ఎస్పీ జాగ్రత్తగా ఉండాలని.. నెలలోపు బదిలీ చేయడం ఖాయమని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కొడవలూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. ఇక్కడ ఉన్నన్ని రోజులు అధికారులు సక్రమంగా పని చేయాలని హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉంటే తెలుగుదేశం నేతలు చెప్పినట్లు ఎస్పీ వ్యవహరిస్తున్నారని ప్రసన్నకుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఎస్పీ వ్యవహారాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళతానని.. ఎస్పీని డీజీపీ ఏమైనా కాపాడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
* ఫిబ్రవరి 1నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పరిశుభ్రమైన టాయిలెట్లు ఉండాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్వహణ ప్రాధాన్యతాంశమని చెప్పారు. టాయిలెట్లు లేకపోవడం, ఉన్నవాటిని సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల చాలా వరకు పిల్లలు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ కారణంగా దీన్ని ప్రాధాన్యతా కార్యక్రమంగా చేపట్టినట్లు వివరించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో సీఎం సోమవారం సమీక్షించారు. టాయిలెట్ నిర్వహణ నిధిపై రాష్ట్ర, జిల్లా, కళాశాల, పాఠశాల స్థాయుల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
* మావోయిస్టు ప్రభావిత, కొండ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం సీఆర్పీఎఫ్‌తో కలిసి బైక్ అంబులెన్స్‌ను డీఆర్డీవో రూపొందించింది. దాడి లేదా ప్రమాదం జరిగిన సందర్భంలో ఘటన ప్రదేశం నుంచి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్‌ను రూపొందించినట్లు డీఆర్డీవో తెలిపింది. సిబ్బంది విధులు నిర్వహిస్తున్న అన్ని ప్రదేశాల్లో ఈ బైక్‌లు వినియోగించనున్నట్లు సీఆర్పీఎఫ్ వెల్లడించింది. విధులు నిర్వహించే ప్రదేశాల్లో సాధారణ ప్రజల కోసం కూడా వీటిని ఉపయోగించనున్నట్లు తెలిపింది.
* దేశంలోని 27 నగరాల్లో వెయ్యి కిలోమీటర్లకు పైగా నిడివిగల వివిధ మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలిపారు. అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశ, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లకు నేడు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రెండు ప్రధాన వాణిజ్య కేంద్రాలైన అహ్మదాబాద్, సూరత్‌ల్లో రవాణా సౌకర్యాలు మెరుగవుతాయన్నారు. మెట్రో ప్రాజెక్టు ఈ రెండు నగరాల ప్రజలకు పర్యావరణహిత ప్రజా రవాణా సాధనం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
* రానున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తెలిపారు. ప్రస్తుతం భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత సువేందు అధికారి పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్థానమైన నందిగ్రామ్ నుంచి మమత పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘ నేను నందిగ్రామ్ నుంచి పోటీచేస్తాను. అది నాకు అదృష్టాన్నిచ్చే ప్రాంతం.’’ అని మమత సోమవారం జరిగిన ఓ ఎన్నికల సమావేశంలో తెలిపారు. భవానిపుర్ నుంచి కూడా పోటీ చేయనున్నట్లు మమత వెల్లడించారు.
* దేశంలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రానప్పటికీ 5జీ సపోర్ట్ చేసే ఫోన్లు మాత్రం మార్కెట్లోకి క్యూ కడుతున్నాయి. గతేడాదే తొలి 5జీ ఫోన్ తీసుకొచ్చిన ఒప్పో.. తాజాగా భారత మార్కెట్లోకి మరో ఫోన్‌ను విడుదల చేసింది. గతేడాది రెనో సిరీస్‌లో తీసుకొచ్చిన 4ప్రో కు కొనసాగింపుగా రెనో 5 ప్రో 5జీని సోమవారం లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8జీబీ/ 128జీబీ వేరియంట్ ధరను కంపెనీ రూ.35,990గా నిర్ణయించింది. జనవరి 22 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్‌తో పాటు ఇతర ప్రముఖ రిటైల్ స్టోర్లలో లభ్యం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై 10 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ కార్డులపై రూ.2,500 మేర క్యాష్‌బ్యాక్ లభించనుంది. పేటీఎం ద్వారా కొనుగోలుపైనా డిస్కౌంట్ లభిస్తుంది.