Agriculture

వేరుశనగ రైతులకు శుభవార్త

వేరుశనగ రైతులకు శుభవార్త

దేశ వ్యాప్తంగా వేరుశనగ దిగుబడి తగ్గటంతో మార్కెట్‌లో వేరుశనగ పంటకు డిమాండ్ భారీగా పెరిగింది. అకాల వర్షాలు, అననుకూల వాతావరణంతో ఈ సారి పంట దిగుబడి ఆశించినంతగా రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా వేరుశనగ దిగుబడి 65 శాతం లోపే ఉంది. అసలే పంటసాగు ప్రతి ఏటా తగ్గుతూ వస్తోంది .దీనికి తోడు దిగుబడి కూడా ఆశించినంతగా రాకపోవటంతో ఒక్కసారిగా మార్కెట్లో వేరుశనగ పంటకు డిమాండ్ పుట్టుకొచ్చింది. రాష్ట్రంలో వేరుశనగ పంట సాధారణ సాగు విస్తీర్ణం 3,05,658 ఎకరాలు. అయితే రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం పంటగా 40వేల ఎకరాల్లో మాత్రమే రైతులు ఈ పంటను సాగు చేశారు.అదికూడా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనే ఈ పంటను అధికంగాసాగు చేశారు. రాష్ట్రం మొత్తం మీద ఈ సారి వేరుశనగ పంట సాధారణ సాగు విస్తీర్ణం తగ్గిపోయింది.
***ప్రతికూల వాతారణంలో ఎలాగోలా పంటను కాపాడు కుంటూ వచ్చారు. దిగుబడి ఆశించినంతగా లేకపొవటంతో కనీసం పెట్టుబడి ఖర్చులైనా వస్తాయా అన్న సందేహాలు రైతులను తొలుస్తూ వచ్చాయి. పంటసాగు ఖర్చులు మాత్రం ఎకరానికి రూ.35000 దాక వచ్చాయి. ఎకరా ఖర్చులు తడిమి చూస్తే పోలంలో దుక్కులకు రూ.2600, అడుగున పిండికి రూ.2500, క్వింటా పల్లీలకు రూ.10,500, పొలంలో విత్తేందుకు రూ.1200, వేరుపురుగునుంచి పంటను కాపాడుకునేందుకు విషపు గులికళకు రూ.400, క్రిమి సంహారక మందుల స్ప్రే ఖర్చులు రూ.5000, కలుపు తీతకు రూ.5000 ఖర్చులు వచ్చాయి. ఇక పంటకోత ఖర్చులు అదనంగానే ఉన్నాయి. వేరుశనగ పంట దిగుబడి ఎకరానికి కనీసం పది క్వింటాళ్ల మేరకు లభిస్తే క్వింటాలు ధర మార్కెట్లో రూ.4800తో విక్రయించినా పదిక్వింటాళ్ల పంటవిక్రయం ద్వారా రూ.48000 లభిస్తే కనీసం పెట్టుబడి ఖర్చులు పోగా ఎకరానికి రూ.10వేలయినా మిగలకపొతుందా అని రైతులు ఆశించారు.
***అయితే అధిక వర్షాలు , అకాల వర్షాలు , అననుకూల వాతావరణ పరిస్థితలతో పంట దిగుబడి వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది. పంట దిగుబడి ఎకరానికి ఐదారు క్వింటాళ్లకు మించి రాలేదు. దీంతో వేరుశనగ సాగు చేసి చేయకాల్చుకున్నామా అని అభిప్రాయానికి వస్తున్న రైతులకు ఒక్కసారిగా దశ తిరిగింది. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు పెరుగుతూ రావటం, వేరుశనగ దిగుబడి 35శాతం తగ్గటం తదితర కారణాలతో వేరుశనగ పంట ధరలు ఒక్కసారిగా పెరిగాయి.దిగుబడి దిగాలుతో ఉన్న రైతుకు పెరిగిన ధరలు జాక్‌పాట్ కొట్టించాయి.రాష్టంలోని ప్రధాన వేరుశనగ మార్కెట్ కేంద్రాల్లో క్వింటాలు ధర రూ.7730కి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం వేరశనగక పంటకు కనీస మద్దతు ధరగా ఈ సారి క్వింటాలుకు రూ.5275 ప్రకటించింది. సరకు తక్కవగా ఉండటంతో ప్రైవేటు వ్యాపారులు వేరుశనగ కొనుగోలుకోసం పోటీ పడుతున్నారు. దీంతో మార్కెట్‌లో వేరుశనగ పంట ధరల సూచిక మద్దతు ధరలను మించి దూసుకుపోతోంది. గత మూడు దశాబ్ధాల కాలంలో వేరుశనగ ధరలు ఇంతటి రికార్డు స్ధాయిలో పెరగటం ఇదే ప్రధమం అని వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన ధరలు నష్టాలభారాన్ని తప్పించాయని వేరుశనగ రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.