వ్యాయామానికి ముందు.. తర్వాత ఏం తినాలి…? ఏం తినకూడదు…?
బరువు తగ్గడానికి, పెరగడానికే కాదు.. మానసిక ఆరోగ్యానికి కూడా వ్యాయామం ఎంతో అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మంచి జీవనశైలి ఏర్పడుతుంది. అయితే ఏదో తూతూ మంత్రంగా కాకుండా వ్యాయామాన్ని కూడా సక్రమంగా చేయాలి.
వ్యాయామం చేయక ముందు, చేసిన తర్వాత తీసుకునే ఆహారాలను బట్టి కూడా దాని ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఏది పడితే అది తిని వ్యాయాయం చేయకూడదు. అలా చేస్తే మొదటికే మోసం. ఒక క్రమపద్దతిలో చేస్తేనే చేసిన పనికి ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరుచుకోవాలంటే వ్యాయామం ఎంతో కీలక పాత్రం పోషిస్తుంది. అలాంటిది వ్యాయామం చేయడానికి ముందు, చేసిన తర్వాత ఏం తినాలో తెలుసుకోవడం ఎంతో ఆవశ్యకం. పలువురు వ్యాయామానికి ముందు ఏం తినకుండానే జిమ్ లలోకి వెళ్లి కసరత్తులు చేసి.. కొవ్వంతా కరిగించుకుని… మళ్లీ ఇంటికి రాగానే కుంభాలకు కుంభాలు లాగించేస్తారు. ఇలా చేయడం వల్ల నష్టమే గానీ లాభం లేదు. వ్యాయామం చేసే ముందు, తర్వాత ఏం తినాలి..? అనేదానిని ఇక్కడ చూద్దాం.
ఎక్సర్సైజ్ చేయడానికి కొద్దిసేపటి ముందే ఏదైనా తినడం మంచిది కాదు. దాని వల్ల అనవసర సమస్యలు వస్తాయి. కొంత గ్యాప్ ఇవ్వాలి. వ్యాయామానికి ఒక గంట నుంచి 3 గంటల ముందు అల్పాహారం చేయాలి. అలాగే కసరత్తులు చేసిన తర్వాత కూడా శరీరానికి శక్తి కావాలి. అందుకే వ్యాయామం అయిన తర్వాత గంట లోపు మీకిష్టమైన పోషకాలున్న ఆహారాన్ని తినాలి. వ్యాయామానికి వెళ్లడానికి ముందు ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ఆ ఆహారం కొవ్వులు, పిండి పదార్థాల మిశ్రమంగా ఉండాలి. అరటిపండు, ధాన్యపు రొట్టెతో చేసిన వెన్న, ఉడికించిన గుడ్లు తీసుకుంటే మంచిది.
వ్యాయమం ముగిసిన తర్వాత బాడీ అలసిపోతుంది. ఈ సమయంలో శరీరానికి శక్తి ఎంతో అవసరం. అదే సమయంలో కసరత్తుల వల్ల ఖర్చైపోయిన ఎనర్జీని పొందడానికి వోట్ మీల్, క్వినోవా, గుడ్లు, గ్రీక్ కర్డ్, చికెన్, చేపలు, గింజలు, మొలకెత్తిన విత్తనాల వంటివి తీసుకోవాలి. వ్యాయామానికి ముందు, తర్వాత కూడా నీళ్లు తాగొచ్చు. ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేయడానికి ముందు సుమారు 2 నుంచి 3 కప్పుల నీళ్లు తాగాలి. ఇక అయిపోయిన తర్వాత కూడా అంతే పరిమాణంలో తాగాలి. రోజులో ప్రతి అరగంటకు ఒకసారి ఒక కప్పు నీళ్లు తాగితే ఎంతో ఉపయోగం.
కసరత్తులు చేస్తున్నప్పుడు..
మీరు హెవీ వేయిట్లు లేపడం, ఎక్కువ కేలరీలు ఖర్చయ్యే వ్యాయాలు చేస్తే.. అందుకోసం ప్రతి అరగండకు 50 నుంచి 100 కేలరీల ఆహారం తీసుకోవాలి. దీనికోసం తక్కువ కొవ్వు ఉన్న పెరుగు, ఎండు ద్రాక్ష లేదా అరటి పండు తీసుకోవాలి.
ఏం తినకూడదు….?
వ్యాయామానికి ముందు గానీ, తర్వాత గానీ కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను గానీ, నిల్వ ఉంచిన ఆహారాలను గానీ అస్సలు తినకూడదు. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.