అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన చేత ప్రమాణం చేయించారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10.20 గంటలకు ఆయన నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. అంతకుముందు అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ప్రమాణం చేశారు. అత్యంత వయోధికుడైన అమెరికా అధ్యక్షుడిగా బైడెన్(78) రికార్డు సృష్టించారు. 48 ఏళ్ల క్రితమే సెనేటర్‌గా ఎన్నికైన బైడెన్.. ఇప్పటివరకు ఆరు సార్లు సెనేటర్‌గా పనిచేశారు. 1988, 2008లోనూ బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడ్డారు. 1988లో అధ్యక్ష ఎన్నికల నుంచి ముందుగానే పోటీ నుంచి వైదొలిగారు. ఒబామా హయాంలో రెండు సార్లు ఉపాధ్యక్షుడిగా బైడెన్ పనిచేశారు.
###########
అమెరికా శ్వేతసౌధానికి డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు పలికారు. కాసేపటి క్రితమే ట్రంప్ తన కుటుంబంతో సహా వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడాకు బయలుదేరారు. ఈరోజు రాత్రి 10.30 గంటలకు అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే బైడెన్ ప్రమాణానికి హాజరు కాకూడదని ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష హోదాలో చివరి రోజు ట్రంప్ 73 మందికి క్షమాభిక్ష పెట్టారు. దాదాపు 70 మంది శిక్షను తగ్గించారు. అయితే స్వీయ క్షమాభిక్షకు ట్రంప్ మొగ్గుచూపలేదు.