Movies

అంతా రహస్యమే!

అంతా రహస్యమే!

వ్యక్తిగత, వృత్తి జీవితాల్ని తాను వేర్వేరుగా చూస్తానని..పర్సనల్‌ విషయాల్ని రహస్యంగానే ఉంచుతానని చెప్పింది పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీ. తన వ్యక్తిగత అంశాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశ్యంతోనే చిత్రసీమకు చెందిన వ్యక్తితో డేటింగ్‌కు దూరంగా ఉన్నానని పేర్కొంది. డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మాథిస్‌బోయేతో ఈ అమ్మడు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ బంధంపై ఎప్పుడూ పెదవి విప్పలేదు తాప్సీ. సోషల్‌మీడియాలో మాత్రం ప్రియుడుతో కలిసి తీయించుకున్న ఫొటోల్ని పంచుకునేది. ఈ విషయం గురించి తాప్సీ మాట్లాడుతూ ‘నా వ్యక్తిగత జీవితం గురించి బయటకు చెప్పడం అస్సలు ఇష్టం ఉండదు. నాకు అత్యంత ఆప్తులైన వారికి సోషల్‌మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తా. మాథిస్‌బోయే కూడా నాకు సన్నిహిత మిత్రుడు. ఆయన పుట్టినరోజున కూడా అలాగే ఫొటోలు షేర్‌ చేశాను’ అని చెప్పుకొచ్చింది తాప్సీ. పెళ్లి గురించి అడగ్గా…‘మా ఇద్దరి మధ్య అనుబంధం మరింత పరిణతి సాధించి గొప్పగా మారాలని కోరుకుంటున్నా. పరస్పరం విశ్వాసం ప్రోది చేసుకున్నాకే వివాహం గురించి ఆలోచిస్తా’ అని తాప్సీ తెలిపింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో ఆరు సినిమాలతో బిజీగా ఉంది. వరుసగా మహిళా ప్రధాన ఇతివృత్తాల్ని ఎంచుకుంటు బాలీవుడ్‌లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా సత్తాచాటుతోంది.