Sports

టాప్-10 క్రీడలు ఇవి

టాప్-10 క్రీడలు ఇవి

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అందుకే పాఠశాలల్లో క్రీడలకు ప్రత్యేకంగా సమయం కేటాయించి విద్యార్థులతో ఆటలు ఆడిస్తారు. చిన్నతనంలో మీరూ ఏదో ఒక క్రీడలో రాణించే ఉంటారు. అయితే, అందరూ క్రీడాకారులు కాలేకపోవచ్చు. కానీ, ఇష్టమైన క్రీడను అభిమానిస్తారు. పోటీలు జరుగుతున్నాయంటే స్టేడియానికి వెళ్లో.. టీవీముందు కూర్చొనో ఆటను చూస్తూ ఆనందిస్తారు. భారతదేశంలో అత్యధిక మంది ఇష్టపడే ఆట.. క్రికెట్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రీడలు ఉన్నాయి. వాటికీ అభిమానులున్నారు. ఇతర దేశాలతో పోటీ పడుతుంటే తమ దేశ జట్టే గెలవాలని ప్రార్థించే వ్యక్తులున్నారు. అయితే, ఇటీవల ఓ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌ టాప్‌ టెన్‌ క్రీడల జాబితాను ప్రకటించింది. అంతర్జాతీయంగా క్రీడను ఇష్టపడే ప్రేక్షకుల సంఖ్య, టీవీ ప్రసార హక్కుల విలువ, ఇంటర్నెట్‌.. సోషల్‌మీడియాలో పాపులారిటీ, క్రీడా పోటీల సంఖ్య, క్రీడాకారుల పారితోషికం వంటి పలు అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఈ జాబితాను రూపొందించింది. మరి ఆ క్రీడలేవో చూద్దామా…
*సాకర్‌/ఫుట్‌బాల్‌
దాదాపు 200 దేశాల్లో 250మిలియన్‌ క్రీడాకారులు ఫుట్‌బాల్‌ ఆడతారు. అంతర్జాతీయంగా ఏటా అనేక టోర్నీలు జరుగుతుంటాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌లో 30కిపైగా దేశాలు పాల్గొంటున్నాయి. కొన్ని దేశాలు అంతర్జాతీయంగా ఆడకపోయినా.. దేశీయంగా ఫుట్‌బాల్‌ టోర్నీలు నిర్వహిస్తుంటాయి. యూరప్‌, ఆఫ్రికా, ఆసియా, అమెరికా ఖండాల్లో ఈ క్రీడకు ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఫుట్‌బాల్‌కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 350కోట్లమంది అభిమానులున్నారు. టీవీల్లో ఈ ఆటను ప్రత్యక్షప్రసారం చూసేవారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది.
*క్రికెట్‌
ఫుట్‌బాల్‌ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ ఉన్న క్రీడ.. క్రికెట్‌. భారత్‌ సహా ఆసియాలోని కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా, యూకె దేశాలు క్రికెట్‌ను ఎక్కువగా ఆడతాయి. అంతర్జాతీయ టోర్నీలో ఆడే జట్ల సంఖ్య 20 కూడా దాటదు. అయినా, ఈ ఆటకు అభిమానులు కోకొల్లలు. క్రికెట్‌ను మొత్తంగా 200-300కోట్ల మంది అభిమానిస్తున్నారు. మ్యాచ్‌ జరుగుతుందంటే స్టేడియంలో సీట్లు నిండిపోవాల్సిందే. టీవీల్లోనూ వీటి వీక్షణ సంఖ్య చాలా ఎక్కువ.
*బాస్కెట్‌బాల్‌
బాస్కెట్‌బాల్‌ను యూఎస్‌ఏ, కెనడా, చైనా, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాల్లో బాగా ఆదరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రీడకు 200 నుంచి 300కోట్ల మంది ఆదరణ ఉంది. యూఎస్‌, చైనా, అర్జెంటీనా, యూరప్‌లోని కొన్ని దేశాల్లోని మీడియా బాస్కెట్‌బాల్‌ పోటీల గురించే ఎక్కువగా వార్తలు, కథనాలు రాస్తుంటాయట.
*హాకీ
ఈ క్రీడను సాధారణ నేలపై, మంచుపై రెండు రకాలుగా ఆడతారు. ఈ రెండు క్రీడలకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది అభిమానులున్నారు. ఫీల్డ్‌ హాకీని భారత్‌, పాకిస్థాన్‌ దేశాలు జాతీయ క్రీడగా భావిస్తాయి. ఐస్‌ హకీని ఎక్కువగా యూరప్‌, కెనడా, యూఎస్‌ఏ, లాట్వియా, స్వీడెన్‌లో ఆడతారు.
*టెన్నిస్‌
టెన్నిస్‌.. ఒకరు లేదా ఇద్దరు చొప్పున ఆడే ఆట. యూరప్‌, అమెరికా, ఆసియా ఖండాల్లో ఈ క్రీడను ఎక్కువగా ఆడుతుంటారు. మన దేశంలో సానియా మీర్జా, లియాండర్‌ పేస్‌ వంటి దిగ్గజ టెన్నిస్‌ క్రీడాకారులు ఉన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటను వంద కోట్ల మంది అభిమానిస్తారట.
*వాలీబాల్‌
భారత్‌లో పాఠశాల, అంతర్రాష్ట్ర స్థాయిలో వాలీబాల్‌ క్రీడలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ, ఆసియాలోని కొన్ని దేశాలు, యూరప్‌, అమెరికా, ఆస్ట్రేలియాలో వాలీబాల్‌ పోటీలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. ఈ క్రీడలో ఒక్కో జట్టులో ఆరుగురు సభ్యులుంటారు. టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అందుకే, పై క్రీడలతో పోలిస్తే వాలీబాల్‌కు కాస్త తక్కువ ఆదరణే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రీడకు 90కోట్ల మంది అభిమానులున్నారు.
*టేబుల్‌ టెన్నిస్‌
టేబుల్‌ టెన్నిస్‌ను పింగ్‌పాంగ్‌ అని కూడా పిలుస్తుంటారు. అంతర్జాతీయ టోర్నీల్లోనే ఎక్కువగా నిర్వహిస్తారు. ప్రత్యక్షంగా క్రీడను వీక్షించే అభిమానులు తక్కువే అయినా ఆటకు పాపులారిటీ ఎక్కువగా ఉంటుంది. ఆసియా, యూరప్‌, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ ఆటకు ఆదరణ లభిస్తుంది. ఈ టేబుల్‌ టెన్నిస్‌కు మొత్తంగా 85కోట్ల మంది అభిమానులున్నారు.
*బేస్‌బాల్‌
భారతీయులకు పెద్దగా తెలియని, చూడని క్రీడ బేస్‌బాల్‌‌. కానీ, యూఎస్‌, జపాన్‌, క్యూబా, డొమినికన్‌ రిపబ్లిక్‌ తదితర దేశాల్లో దీన్ని ఎక్కువగా ఆడతారు. ఈ ఆటకు 50కోట్ల మంది అభిమానులున్నారు.
*రగ్‌బీ
సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ సినిమా రగ్‌బీ క్రీడ నేపథ్యంలో సాగుతుంది. ఆ క్రీడ మనకు కొత్తగా అనిపించొచ్చు. కానీ.. ఆస్ట్రేలియా, యూఎస్‌ఏ, ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా దేశాల్లో చాలాకాలంగా ఈ రగ్‌బీ ఆడుతున్నారు. ఈ క్రీడను 41కోట్ల మంది అభిమానిస్తున్నారు.
*గోల్ఫ్‌
గోల్ఫ్‌ను సంపన్నుల ఆటగా అభివర్ణిస్తుంటారు. యూరప్‌, ఆసియా, అమెరికా, కెనడాలో ఎక్కువ గోల్ఫ్‌ టోర్నీలు జరుగుతుంటాయి. ఈ క్రీడకు 39కోట్ల మంది అభిమానులున్నారు.