కొల్లేరులోని నల్లజాతి చేపలకు ఇతర రాష్ట్రాలలో భారీగా డిమాండ్ పెరిగింది. సహజసిద్ధ ప్రకృతి అందాలకు నెలవుగా పరిఢవిల్లుతున్న కొల్లేరు సరస్సుకు ఈ ఏడాది వచ్చిన భారీ వరద స్థానిక మత్స్యకారులకు వరంగా మారింది. వరద నీటి రాకతో నల్లజాతి మత్స్యసంపద గణనీయంగా వృద్ధిచెందేందుకు అవకాశాలు మెరుగయ్యాయి. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నడుమ 77,138 ఎకరాల్లో విస్తరించిన కొల్లేరు సరస్సును నమ్ముకుని ఏడు మండలాల్లోని 122 బెడ్డు, బెల్టు గ్రామాల్లో మూడు లక్షల వరకు మత్స్యకారులు జీవిస్తున్నారు. గత అయిదేళ్లుగా సరస్సులో పరిస్థితులు మారిపోయాయి. ప్రధాన ఉపడ్రెయిన్లు తమ్మిలేరు, రామిలేరులను పోలవరం కుడికాలువలో కలపడంతో అనుకున్నస్థాయిలో వరద నీరు రావడం లేదు. ఉప్పు శాతం పెరిగి డిసెంబరు నాటికే సరస్సు పూర్తిగా ఎండిపోయేది. మత్స్యకారులు జీవనోపాధి లేక వివిధ రాష్ట్రాలకు వలసలు వెళ్లి కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. చాలా ఏళ్ల తరవాత సరస్సుకు ఈసారి భారీ వరద రావడంతో అనుకున్న స్థాయిలో ఉపాధిని పొందే అవకాశం లభించింది. కొల్లేరులో సహజంగా పెరిగే నల్లజాతి చేపలైన కొరమేను, నాటు గొరక, జెల్ల, వాలుగ, మలుగుపాము, తుళ్లు, మట్టగిడస, ఇంగిలాయి, తిలాపీ జాతులను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి లాభాలను ఆర్జిస్తున్నారు. అనుకున్నస్థాయి కంటే అధికంగా మత్స్య సంపద చిక్కడంతో మత్స్యకారుల ఆనందానికి అవధుల్లేవు. సరస్సులోని చేపలకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగి.. ధరలు ఆశాజనకంగా ఉండడంతో భారీగా ఎగుమతులు చేస్తున్నారు. దేశంలోనే సహజసిద్ధంగా లభించే నల్లజాతి మత్స్య సంపదకు కొల్లేరు ప్రధాన వనరు. ఈ ప్రాంతం నుంచే మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌లకు నల్లజాతి చేపలను ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా మంచినీటి చేపల్లో రారాజుగా పిలిచే కొరమేను ఉత్పత్తి ఈ ఏడాది భారీగా పెరిగింది. ఏటా రెండు వేల టన్నుల వరకు కొరమేను ఎగుమతి చేస్తుంటే ప్రస్తుతం నాలుగు వేల టన్నుల వరకు ఉత్పత్తి ఉండేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్ద కొరమేనుతో పాటు చిన్నపిల్లలకు సైతం భారీగా డిమాండ్ ఉండడంతో మత్స్యకారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కొల్లేరు చేపల రైతుల ఆనందం
Related tags :