అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారానికి తైవాన్ అనధికారిక రాయబారి బై కెమ్ షియావ్ హాజరయ్యారు. 1979 తరవాత ఓ తైవాన్ ప్రతినిధి ఇలాంటి కార్యక్రమానికి అధికారికంగా హాజరుకావడం ఇదే తొలిసారి. అంతకుముందే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీకాలం చివరి రోజుల్లో రాబోయే సర్కారు వెంటనే చైనాకు గేట్లు తెరవకుండా ఏర్పాట్లు చేశారు. తమదౌత్య ప్రతినిధులు, ఉన్నతాధికారులు తైవాన్‌తో సంబంధాలు నెరపకుండా విధించుకున్న స్వీయ ఆంక్షలను తొలగిస్తున్నట్లు ఈ నెల తొమ్మిదో తేదీన అమెరికా విదేశాంగశాఖ ప్రకటించింది. కమ్యూనిస్టు చైనాను తృప్తిపరచడంకోసం గతంలో తాము తప్పు చేశామని పరోక్షంగా పేర్కొంది. ఏక చైనా విధానానికి నీళ్లొదలడం లేదంటూనే తైవాన్‌తో సంబంధాల బాధ్యతను ‘అమెరికా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ తైవాన్’కు కట్టబెడుతున్నట్లు అధికారికంగా వెల్లడించింది.
చైనా తీరు మారకపోతే తైవాన్‌తో అధికారిక సంబంధాలు సైతం కొనసాగించేందుకు వీలుగా క్షేత్రస్థాయి ఏర్పాట్లకు బీజం పడింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవడం తేలికే అయినా… చైనా అనుకూలుడిగా ముద్రపడే అవకాశం ఉండటంతో బైడెన్ కూడా అందుకు ఆసక్తి చూపలేదు. కొత్త విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకన్ నుంచీ చైనాకు ఎటువంటి హామీ లభించకపోవడం గమనార్హం. మరోవైపు మాజీ విదేశాంగ మంత్రి పాంపియో సహా 28 మంది అధికారులపై చైనా ఆంక్షలు విధించింది. అమెరికా విదేశాంగ శాఖ నిర్ణయాన్ని మరో కోణంలో చూస్తే తైవాన్ వద్ద ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది. తైవాన్ రక్షణకు అమెరికా బాధ్యత వహించేలా రాతపూర్వక ఒప్పందం ఏమీ లేదు. అమెరికాతో దౌత్య సంబంధాల పెంపు, ‘ఇండో-పసిఫిక్ వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక’లో తైవాన్ పాత్రను మరీ మరీ ప్రస్తావించడం బీజింగ్‌లో అనుమానాలను పెంచేస్తాయి. అది షీ జిన్‌పింగ్ ‘2049’ ప్రణాళికను వేగవంతం చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే ‘గ్రే జోన్’ యుద్ధతంత్రాన్ని చైనా అనుసరిస్తోందని రాయిటర్స్ పరిశోధనాత్మక కథనం వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్ 2016లో బాధ్యతలు స్వీకరించగానే తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్ వెన్ ఫోన్ చేయడం పెనుప్రకంపనలు సృష్టించింది. అప్పట్లో ట్రంప్ దీనిపై ఎటువంటి వివరణలూ ఇవ్వకపోవడం ఆయన భవిష్యత్తు వైఖరిని తెలియజేసింది. బిల్‌క్లింటన్ తరవాత తైవాన్‌తో అత్యధిక ఆయుధ ఒప్పందాలు (సుమారు 20 వరకు) చేసుకొన్నది ట్రంపే. అమెరికా బహిరంగంగా చెప్పకపోయినా- తైవాన్‌ను ఓ దేశంగానే చూస్తోంది. అది చైనాలో భాగంగా భావిస్తే సొంత టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఆయుధాలను ఎందుకు విక్రయిస్తుంది? తైవాన్ ఆత్మరక్షణ శక్తికి ఓ రకంగా ట్రంప్ ఊపిరులూదారు. చైనా దూకుడుకు కళ్లెం వేసేలా తైవాన్ సంబంధాల హామీ చట్టంపై డిసెంబరులో సంతకం చేశారు. బైడెన్ హయాములో ఇవి ఆగుతాయనే సంకేతాలేమీ లేవు. ‘మిస్టర్ మినిస్టర్, మా ప్రభుత్వం ఏక చైనా విధానానికి మద్దతిస్తుంది. అలానే మీరు ఏక భారత్ విధానాన్ని పాటిస్తారని ఆశిస్తున్నాను’ అని 2014లో నాటి విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చైనా మంత్రి వాంగ్‌యీని కోరారు. పీఓకేలో చైనా కార్యకలాపాలు నిర్వహించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని అన్న ఈ మాటకు వాంగ్‌యీ మౌనంగా ఉండిపోయారు.
డోక్లాం వివాదం తరవాత కూడా చైనా ఒత్తిడికి తలొగ్గి భారత్ ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌లో తైవాన్ బదులు ‘చైనీస్ తైపీ’ అని పేరు మార్చింది. మొదటి నుంచి చైనా భావాలను గౌరవించడం వల్ల భారత్‌కు ఒరిగిందేమీ లేదు. పాక్‌కు డ్రాగన్ చేసే సాయం ఆగలేదు. శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ ప్రభుత్వాలను భారత్‌పైకి చైనా ఎగదోసింది. ఇది భారత్‌ను బలహీనదేశంగా చూపి ఒంటరిని చేసే యత్నం. భారత్ సైతం మెల్లగా ఏకచైనా విధానానికి పొగపెడితే గానీ డ్రాగన్‌కు నొప్పి తెలియదు. ‘అలీపే’కు జరిగిన నష్టాన్ని చూశాక టెక్ కంపెనీలకు చైనా ఓ ముళ్లపాన్పును తలపించడం ఖాయం. తైవాన్ టెక్ కంపెనీలకు సకల సదుపాయాలతో భారత్ స్వాగతం పలకాలి. ఆర్‌సీఈపీలో తైవాన్, భారత్‌లు భాగస్వాములు కాదు. చైనా బెదిరింపులను ఖాతరు చేయకుండా తైవాన్-భారత్‌లు స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం చేసుకోవాలి. ఈ ఒప్పందంలో భారత్‌కు వాణిజ్య మిగులు లభించే అవకాశం ఉంది. అంతేకాదు ఇండో-పసిఫిక్‌లో మనం చురుగ్గా వ్యవహరించాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో భారత్ మిత్రులతో కలిసి బలపడకపోయినా, మౌనంగా ఉన్నా- డ్రాగన్‌కు అపరిమితమైన శక్తి లభిస్తుంది. అది అంతిమంగా మన దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుంది.