Business

రైళ్లల్లో భోజన సదుపాయం పునఃప్రారంభం

రైళ్లల్లో భోజన సదుపాయం పునఃప్రారంభం

ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌. రైల్వే ప్రయాణికులకు ఆహారం అందించే ఈ- కేటరింగ్‌ సేవలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. కొవిడ్‌-19 కారణంగా నిలిచిపోయిన ఈ సేవలను వచ్చే నెల నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి నుంచి ఈ సేవలు దశలవారీగా అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. తొలుత 30 రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులు తాము కోరుకున్న స్టేషన్లలో కోరుకున్న ఆహారాన్ని సీట్ల వద్దకే అందించే కేటరింగ్‌ సేవలను ఐఆర్‌సీటీసీ 2014లో ప్రారంభించింది. కొవిడ్‌-19 ముందు రోజుకు 20వేల ఆర్డర్లు వచ్చేవి. దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా ఈ సేవలను మార్చి 22న నిలిపివేశారు. కొన్ని నెలలుగా ప్రత్యేక రైళ్ల పేరుతో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ-కేటరింగ్‌ సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో రైల్వేమంత్రిత్వ శాఖ అనుమతితో ఈ సేవలు ప్రారంభించనున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. www.ecatering.irctc.com వెబ్‌సైట్‌ ద్వారా గానీ, 1323 నంబర్‌కు కాల్‌చేయడం ద్వారా గానీ, ఐఆర్‌సీటీసీ ‘ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌ యాప్‌’ ద్వారా గానీ ఈ సేవలను పొందొచ్చు. క్యాష్‌ ఆన్‌ డెలివరీ సదుపాయం కూడా అందిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది.