Sports

ఓడిపోయి ఇంటికొస్తున్న సింధు. సెమీస్‌కు దూసుకెళ్లిన సాత్విక్.

ఓడిపోయి ఇంటికొస్తున్న సింధు. సెమీస్‌కు దూసుకెళ్లిన సాత్విక్.

టొయొటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీలో భారత అగ్రశ్రేణి డబుల్స్‌ క్రీడాకారుడు సాత్విక్‌ సాయిరాజు సత్తాచాటుతున్నాడు. పురుషుల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అతను సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో సాత్విక్‌- అశ్విని జోడీ 18-21, 24-22, 22-20తో అయిదో సీడ్‌ పెంగ్‌ సూన్‌- ల్యూ యింగ్‌ (మలేసియా) జంటకు షాకిచ్చింది. గంటా 15 నిమిషాల పోరులో సాత్విక్‌- అశ్వినిలు సమన్వయంతో సత్తాచాటారు. నరాలు తెగే ఉత్కంఠభరిత పోరులో సమయస్ఫూర్తితో పైచేయి సాధించారు. పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌శెట్టి 21-18, 24-22తో యూసిన్‌- తియో యి (మలేసియా)పై విజయం సాధించారు. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సాత్విక్‌- చిరాగ్‌ల జోడీ ప్రత్యర్థి జంటపై ఆధిపత్యం కనబరిచింది. శనివారం జరిగే మిక్స్‌డ్‌ సెమీస్‌లో టాప్‌ సీడ్‌ దెచపోల్‌- సప్సిరీ (థాయ్‌లాండ్‌)తో సాత్విక్‌- అశ్విని తలపడతారు. ఇక ప్రపంచ ఛాంపియన్‌ పి.వి.సింధు పోరాటం ముగిసింది. 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న భారత స్టార్‌ షట్లర్‌ సింధుకు వరుసగా రెండో టోర్నీలోనూ చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో ఆరో సీడ్‌ సింధు 13-21, 9-21తో నాలుగో సీడ్‌ ఇంతానన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం చవిచూసింది. 38 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి ముందు సింధు పూర్తిగా తేలిపోయింది. వరుస గేమ్‌ల్లో చిత్తయింది. తొలి గేమ్‌లో 13 పాయింట్ల వరకే సింధు పోరాడింది. ఆ తర్వాత ఆటంతా రచనోక్‌దే. వరుసగా 8 పాయింట్లు గెలుచుకున్న రచనోక్‌ 21-13తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌ ఏకపక్షంగా ముగిసింది. ప్రత్యర్థికి ఏ దశలోనూ సింధు పోటీ ఇవ్వలేకపోయింది. ఆరంభంలోనే 1-8తో వెనుకబడిన సింధు మళ్లీ కోలుకోలేదు. 14-4తో ముందంజ వేసిన రచనోక్‌ 21-9తో రెండో గేమ్‌ను, మ్యాచ్‌ను గెలుచుకుంది. సింధుపై తన గెలుపోటముల రికార్డును 5-4కు పెంచుకుంది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సమీర్‌వర్మ 13-21, 21-19, 20-22తో మూడో సీడ్‌ ఆండర్స్‌ ఆంథోన్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో పోరాడి ఓడాడు.