NRI-NRT

విమర్శల పాలవుతున్న “తానా” పెద్దల వైఖరి-TNI ప్రత్యేకం

TANA Elections 2021 - Will TANA Lead To Another Split?

అమెరికాలో ప్రముఖ తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)లో త్వరలో జరగబోయే ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తానా సభ్యులను కలవరపెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జరగబోయే ఎన్నికలు తీవ్ర పరిణామాలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తానా అధ్యక్ష పదవికి త్రిముఖ పోటీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మిగిలిన పదవులకు పోటీ తీవ్రంగా ఉండే పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి.

* అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ
తానా అధ్యక్ష పదవికి కోడాలి నరేన్, శృంగవరపు నిరంజన్, గోగినేని శ్రీనివాసలు పోటీలో ఉంటున్నట్లు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు. ప్రస్తుత తానా కార్యదర్శి పొట్లూరి రవి ఊగిసలాట ధోరణిలో ఉన్నారు. అవకాశం దొరికితే పొట్లూరి రవి కూడా అధ్యక్ష పదవికి బరిలో దిగడం కోసం సన్నద్ధంగా ఉన్నట్లు సన్నిహితులకు సంకేతాలు పంపుతున్నారు.

* విమర్శల పాలవుతున్న తానా పెద్దల వైఖరి
గతంలో తానా అధ్యక్షులుగా పని చేసిన వారు ఆ పదవులను సమర్ధవంతంగా నిర్వహించి తానా కార్యకలాపాల నుండి గౌరవంగా తప్పుకున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే…అదీ ఎవరైనా అడిగితేనే సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తానా అధ్యక్షులుగా పని చేసిన కోమటి జయరాం, నాదెళ్ళ గంగాధర్ తానాలో తమ పట్టు నిలబెట్టుకోవడం కోసం బలమైన వర్గాన్ని పోషిస్తున్నారు. తానాలో తాము చెప్పిందే జరగాలని…తమ మాటే వేదవాక్కని వీరు ఇరువురు ఇప్పటి వరకు చక్రం తిప్పారు. జరగబోయే ఎన్నికల్లో కూడా తమ మాటే నెగ్గాలని వీరు పట్టుదలతో ఉన్నారు. గత పర్యాయం తానా అధ్యక్షుడిగా పనిచేసిన వేమన సతీష్, ప్రస్తుత అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్న తాళ్ళూరి జయశేఖర్‌లు అనుసరిస్తున్న విధానం కూడా విమర్శలకు తావిస్తోంది. వేమన సతీష్‌కు కుడిభుజంగా ఉండే కొడాలి నరేన్ అభ్యర్ధిత్వాన్ని కోమటి జయరాం బహిరంగంగా బలపరచడం విమర్శల పాలైంది. ప్రస్తుత అధ్యక్షుడు జయశేఖర్ కూడా ఇదే బాటలో నడిచారు. శృంగవరపు నిరంజన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు.

* మీరే ఇలా చేస్తే ఎలా?
తానాలో ఎన్నికలు జరిగే సమయంలో పెద్దలుగా వ్యవహరించే వారు హుందాగా వ్యవహరించాలి. వివాదాలకు తావు లేకుండా ఎన్నికలు జరిగేలా చూడవలసిన బాధ్యత వారి మీద ఉంది. దానిని విస్మరించి మీరే అభ్యర్ధులను నిర్ణయించి వారికి బహిరంగంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే మద్దతు ప్రకటించడం ఎంత వరకు సమంజసమని తానా వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి తానా ఎన్నికలను ఏకగ్రీవంగా, ప్రశాంతంగా నిర్వహించవలసిన బాధ్యత తానా మాజీ అధ్యక్షులపైన, ప్రస్తుత అధ్యక్షుడిపైన, మరికొందరు సీనియర్ నేతలపై ఉంది. ఈ బాధ్యతను విస్మరించి మీరే పందెం కోళ్ళను బరిలోకి దింపి సవాళ్ళు విసరడం సరికాదని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

* తానాలో మరో చీలికకు మీరే కారకులు కావద్దు!
ఇప్పటికే తానాలో మా మాటే చెల్లుబాటు కావాలనే కొందరు పెద్దల మూలంగా గతంలో తానాలో చీలిక వచ్చింది. ఆటా, నాట్స్‌లుగా చీలిపోయింది. ప్రస్తుతం తానాలో తమ స్వార్ధం కోసం, తమ పట్టు నిలవడం కోసం వర్గాలను పోషిస్తున్న వారు ఇప్పటికైనా వచ్చే తానా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్లు చూడాలి. పోటీలకు దిగేవారిని ఒక మెట్టు దిగి అనునయించాలి. అందరి ఏకాభిప్రాయంతో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవ ఎన్నిక చేయడం మీ చేతుల్లోనే ఉంది. దీనిని విస్మరించి అహంకారంతో వ్యవహరిస్తే తానా భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరో చీలిక దిశగా తానాలో పరిస్థితులు ఏర్పడతాయని తానా సభ్యులు, శ్రేయోభిలాషులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు.

—కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.