సాయంకాలం స్నాక్ అనగానే ఒకప్పుడు వేడివేడి పకోడీనే గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఎక్కడైనా ఎవరికైనా ఠక్కున స్ఫురించేది సమోసానే. ఆ రుచికి దేశీయులే కాదు, విదేశీయులూ ఫిదానే. అంతేనా… పిజ్జాలూ బర్గర్లతో పోల్చితే సమోసా ఆరోగ్యకరం అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సైతం పేర్కొనడంతో ఆ రుచుల్ని మరింత మక్కువతో ఆస్వాదించేస్తున్నారు. మరి సమోసాలోని ఆ స్టఫ్ ఏంటో మనమూ రుచి చూద్దామా..!
** పిజ్జా కావాలి, చాక్లెట్టే తింటా… అని మారాం చేసే పిల్లలైనా సరే, గరం గరం సమోసా ఒకటి చేతికిస్తే మారు మాట్లాడకుండా తింటూ కూర్చుంటారు. ఇక, డైటింగ్ అంటూ కాసిని మొలకలూ కీరా ముక్కలతో కడుపు నింపుకునే అమ్మాయిలైనాగానీ సమోసా గాలి తగిలితే ఓ పట్టు పట్టకుండా వదలరు. సమోసా రుచి అలాంటిది మరి. ఆలూబఠాణీ, కీమా, మొక్కజొన్న, చికెన్… ఇలా అందులో ఏది నింపినా, దాన్ని తిన్నవాళ్లు అద్భుతః అనాల్సిందే. అందుకే అది సరిహద్దులు దాటి విదేశీయుల్నీ చవులూరిస్తోంది. అంతెందుకు… ఒకప్పుడు ఇరానీ కెఫెలో సమోసా ఉన్నప్పటికీ చాయ్‌లో ముంచుకుని తినడానికి బన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పురాతన ఇరానీ కెఫె కావచ్చు, సరికొత్త ఫుడ్ ట్రక్ కావచ్చు… ఎక్కడికెళ్లినా సాయంకాలం స్నాక్ అంటే సమోసా చాయ్ అన్నది స్థిరపడిపోయింది. అంతగా అది ప్రాచుర్యం పొందడానికి రుచి ఒకకారణమైతే, ఏ పదార్థాన్నయినా స్టఫ్ చేయగలగడం ఈ వంటకం తయారీలో ఉన్న మరో సౌలభ్యం.
మైదా లేదా గోధుమ పిండిని చపాతీలా చేసి పొట్లంలా మడిచి అందులో ఆలూ కూర పెట్టి త్రికోణాకారంలో చుట్టి నూనెలో వేయిస్తే ఘుమఘుమలాడే ఆ వాసనకి, క్యాలరీలు గుర్తొచ్చినా సరే తినకుండా ఉండటం కష్టమే మరి. అందుకే ఈమధ్య బరువు పెరగకుండా ఉండేందుకు సమోసాని ముడి గోధుమపిండిలో కాస్త రవ్వ కలిపి చేస్తున్నారు.
*జొన్నపిండి, రాగిపిండితో చేసుకునేవాళ్లూ ఉన్నారు. అయితే ఏ పిండితో చేసినా వేయించడం వల్ల అంతో ఇంతో క్యాలరీలు పెరగడం ఖాయం. అందుకే ఇప్పుడు దాన్ని ఓవెన్‌లో బేక్ చేయడం లేదా ఎయిర్ ఫ్రయర్‌లో వేయించుతున్నారు. ఉదాహరణకు నూనెలో వేయించిన వంద గ్రా. సమోసాలో 260 క్యాలరీలు ఉంటే, బేక్ చేసిన సమోసా నుంచి వచ్చే క్యాలరీలు కేవలం 32 మాత్రమేనట. అంటే- నూనెలో వేయించకుండా బ్రష్‌తో ఆలివ్ ఆయిల్ పూసి ఓవెన్‌లో బేక్ చేయడం లేదా ఎయిర్ ఫ్రయిర్‌లో వేయించితే క్యాలరీల శాతం బాగా తగ్గిపోతుంది. దాంతో అది ఆరోగ్యకరమైన స్నాక్‌గా మారింది. అంతేనా… అందులో ఆలూ, బఠాణీ, ఉల్లి, కీమా, చికెన్, మటన్ వంటి వాటితోపాటు చాక్లెట్, నూడుల్స్, పనీర్, ఐస్‌క్రీమ్… ఇలా సరికొత్త రుచుల్నీ నింపేస్తున్నారు. దాంతో సమోసా చిన్నాపెద్దా అందరికీ హాటెస్ట్ ఫేవరెట్‌గా మారిపోయింది.
**రూపం మారింది!
త్రికోణాకారం లేదా పిరమిడ్ ఆకారంలో ఉండే సమోసా రూపురేఖల్నీ పూర్తిగా మార్చేస్తున్నారు ఆధునిక షెఫ్‌లు. అర్ధచంద్రాకారంగానూ గుండ్రంగానూ కోన్ ఆకారంలోనూ పువ్వులానూ చాప డిజైన్లలోనూ కజ్జికాయల మాదిరిగానూ… ఇలా ఒకటని కాకుండా తమకు నచ్చిన రూపంలో సమోసాని చుట్టేస్తూ దానికో డిజైనర్ లుక్ తీసుకొస్తున్నారు.
*సమోసానే సంబోసా, సొమాసి, సోమా సంసా… ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. నిజానికి సమోసా అంతా అనుకున్నట్లుగా మనది కాదు, మధ్య తూర్పు, మధ్య ఆసియా దేశాల నుంచి వ్యాపారుల ద్వారా మనదేశంలోకి ప్రవేశించింది. దిల్లీ సుల్తానుల కొలువులో పనిచేసిన అమీర్‌ఖుస్రో, ఇబన్ బటూటా అనే చారిత్రక యాత్రికుడు తమ రచనల్లో సమూసాక్ పేరుతో దీన్ని ప్రస్తావించారు. అప్పట్లో దీన్ని కీమా, బాదం, పిస్తా, అక్రోట్లు, ఇతర మసాలాద్రవ్యాలూ కలిపిన స్టఫ్‌తో వడ్డించేవారట. సాంబూసా పేరుతో అయినె-అక్బరీలోనూ దీని గురించిన వర్ణన ఉంది. అయితే అప్పటినుంచీ వాడుకలో ఉన్నప్పటికీ ఇటీవల కాలంలోనే దీనికి మరింత ఆదరణ పెరిగిందని చెప్పాలి. ఉడికించిన మొక్కజొన్న గింజలతో స్టఫ్ చేసిన సమోసా నేటి యువతకు బాగా నచ్చడంతో ఇది అందరి ఫేవరెట్ స్నాక్‌గా మారిపోయింది.
*ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఘండ్‌లలో వీటిని షింగారా అనీ, కాలీఫ్లవర్‌తో నింపితే ఫుల్కోపిర్ షింగారా అనీ పిలుస్తారు. బెంగాల్‌లో అయితే మటన్, చేపల కూరల్నీ స్టఫ్ చేస్తారు. అలాగే కోవా, కొబ్బరి మిశ్రమాల్ని నింపి, ఆపై పాకంలో ముంచి తీసిన తీపి సమోసాల్నీ ఇష్టంగా తింటారు బెంగాలీయులు. మధ్య తూర్పు దేశాల్లో డ్రైఫ్రూట్స్, హల్వాలాంటి వాటినీ నింపి తయారుచేస్తుంటారు. ఇక, హైదరాబాద్‌లో ఉల్లి మిశ్రమాన్ని నింపి చేసే ఇరానీ సమోసాకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ స్థానాన్ని కార్న్ సమోసా కైవసం చేసుకుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
**ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో బంగాళాదుంప, ఉల్లి, బఠాణీ, క్యారెట్, క్యాబేజీ, కరివేపాకు, పచ్చిమిర్చి… కలిపిన మిశ్రమంతో చేసిన సమోసాకే ఓటు. వీటిని చట్నీ అవసరం లేకుండానే తినేయొచ్చు. ఇక, సమోసాకి ఇతర రుచులను జోడించి సమోసా చాట్, సమోసా పావ్, బన్ సమోసా, సమోసా ర్యాప్… వంటి కొత్త తరహా చాట్ రకాల్నీ సృష్టించేశారు. అందుకే చాట్‌బండార్‌కి వెళితే సమోసా చాట్ తినకుండా రారెవరూ. ఆసియా దేశాల్లోనే కాదు, దక్షిణాఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లోనూ సమోసా స్ట్రీట్ ఫుడ్‌గా పేరొందింది. పని ఒత్తిడి మధ్యలో ఓ సమోసా తిని, ఓ కప్పు వేడి చాయ్ తాగితే వచ్చే కిక్కే వేరు. అందుకేనేమో ఆఫీసుల్లో చాయ్-సమోసా బ్రేక్ అన్న కొత్త పదబంధం వాడుకలోకి వచ్చేసింది.
ముఖ్యంగా, మరే వంటకానికీ లేని సౌలభ్యం అంటే- దేన్నయినా నింపుకుని సరికొత్త రుచిని అందించే గుణం సమోసాకి ఉంది. అందుకే పాస్తా, చాకొలెట్, ఎగ్, చీజ్, చేప, తందూరీ పనీర్, కాలీఫ్లవర్, మష్రూమ్, కార్న్, రొయ్యలు… ఇలా అదీ ఇదీ అని లేకుండా తినే రకాలన్నింటినీ సమోసాల్లో స్టఫింగ్ చేసి వండేస్తున్నారు మాస్టర్ షెఫ్‌లు. వాటన్నింటినీ ఎంతో ఇష్టంగా ఆస్వాదించేస్తున్నారు సమోసా ప్రియులు. కీమా సమోసాని నోట్లో పెట్టుకుంటే స్వర్గం కళ్లెదుటే ఉంటుందని నాన్‌వెజ్ ప్రియులంటే, చోళె సమోసా అయితే తింటూనే ఉండాలనిపిస్తుంది అంటారు శాకాహారులు. మొత్తంమీద అటు శాకాహారులూ ఇటు మాంసాహారులూ కూడా ఎంతో ఇష్టంగా తినే రుచికరమైన స్నాక్ కమ్ ఎపెటైజర్ కమ్ ఫుల్ మీల్… సమోసా..!
సమోసా తింటున్నారా?
Related tags :