* దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకీకి చెందిన ప్రీమియం హాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కార్ల విక్రయాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2020లో అత్యధికంగా అమ్ముడుపోయిన మోడల్‌గా స్విఫ్ట్ అగ్రస్థానంలో నిలిచిందని సంస్థ శనివారం వెల్లడించింది. గతేడాది మారుతి సుజుకీ 1,60,700 యూనిట్ల స్విఫ్ట్‌లను విక్రయించింది.
* దేశంలో ఇంధన ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఇంధన ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గింపు యోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే చమురు మంత్రిత్వ శాఖ ఆర్థికశాఖకు లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు కేంద్రం దేశంలో ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. అయితే ఇప్పుడు ఇంధన ధరలు మండిపోతుండటంతో వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు సుంకాన్ని తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు.
* టిక్‌టాక్ సహా ఇతర చైనీస్ యాప్‌లపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసిందని సమాచారం. నిషేధాజ్ఞలపై మరోసారి సమీక్షించాలని యాప్‌లు కోరగా కుదరదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు ఇచ్చిందని కీలక వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై టిక్‌టాక్‌ను సంప్రదించగా ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం వాస్తవమేనని ధ్రువీకరించింది.
* టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ మోడల్‌లో మరో కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఆల్ట్రోజ్ ఐ-టర్బోగా పేర్కొంటున్న ఈ కారు ప్రమీయం హాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో సరికొత్త ఫీచర్లు, కనెక్ట్ టెక్నాలజీ, మరింత శక్తిమంతమైన ఇంజిన్‌తో వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్, ఎక్స్‌జెడ్‌ప్లస్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆల్ట్రోజ్ రెవోట్రాన్ మోడళ్ల కంటే దీని ధర రూ.60వేలు అధికంగా ఉంది. పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.8.26 లక్షలు కాగా.. డీజిల్‌ది రూ.9.46 లక్షలు(దిల్లీ, ఎక్స్‌షోరూం).