* తొలిసారిగా రైళ్ల ద్వారా శీతలీకరణ కంటైనర్లలో అరటి పండ్లను రవాణా చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ఈ అరటి పండ్లను ముంబైలోని నెహ్రూ పోర్టు ట్రస్టుకు రవాణా చేస్తున్నామని శనివారం ఓ ప్రకటనలో అధికారులు తెలిపారు. అక్కడి నుంచి తూర్పు దేశాలకు ఎగుమతి కానున్నాయి. సాధారణంగా అరటి పండ్లను రోడ్డు మార్గంలో రవాణా చేస్తుంటారు. అయితే అధిక సమయం పడుతుండటంతో నష్టం వాటిల్లుతున్నది. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరస్పర సహకారంతో రవాణాకు మార్గం సుగమమైంది. కాగా, రవాణా సమయంలో కంటైనర్లకు విద్యుత్ సరఫరాలో అవాంతరాలు లేకుండా ఉండేందుకు ప్రతీ రైలుకు 2 పవర్ ప్యాక్స్ ఏర్పాటు చేశారు. సుమారు 977 టన్నుల అరటి పండ్లను 43 రిఫ్రిజిరేటర్ కంటైనర్లలో లోడ్ చేసిన రైలు శుక్రవారం తాడిపత్రి నుంచి ముంబై పోర్టుకు బయలుదేరింది.
* ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాలో కెరీర్ ప్రారంభించిన మూడు రోజుల్లోనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన దొంగ బుద్ది బయటపెట్టుకున్నాడు. అలెక్స్ ఖాతిలోవ్ అనే ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్.. రోడ్ మ్యాప్ ఫర్ టెస్లాస్ ఇన్నోవేషన్ ప్లాన్‌కు సంబంధించిన 26 వేల కాన్పిడెన్షియల్ ఫైళ్లను క్లౌడ్ స్టోరేజీ సర్వీస్ డ్రాప్‌బాక్స్ సొంత ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ.. సంస్థ సెక్యూరిటీ టీంకు పట్టుబడ్డాడు.
* గత వారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ట్రేడింగ్ 50 వేల మార్క్‌ను దాటి దిగి వచ్చినా.. టాప్10 బ్లూ చిప్ కంపెనీల్లో నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,15,758.53 కోట్లకు పెరిగింది. మార్కెట్ లీడర్ రిలయన్స్ ఎం-క్యాప్ రూ.71,033.44 కోట్లు ఎగబాకింది.
* కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి పేపర్‌లెస్ బడ్జెట్ పార్లమెంట్‌లోకి వస్తున్నది. సభ్యుల కోసం ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్’ను శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు. దీనిద్వారా 14 యూనియన్ బడ్జెట్ డాక్యుమెంట్ల పూర్తి వివరాల్లోకి వెళ్లవచ్చు. బడ్జెట్ ప్రకటన అనంతరం ఈ యాప్ అందుబాటులోకి వస్తుంది. కాగా, కొవిడ్-19 దృష్ట్యా ఎంపీలకు భౌతికంగా పత్రాల అందజేత శ్రేయస్కరం కాదన్న ఆలోచనతోనే తొలిసారి ఈ పేపర్‌లెస్ బడ్జెట్‌కు మోదీ సర్కారు సై అన్నది. 1947 నవంబర్ 26న దేశంలో తొలి బడ్జెట్‌ను ప్రకటించారు. అప్పట్నుంచి పార్లమెంట్ సభ్యులకు ఆర్థిక బిల్లు, కొత్త పన్నుల వివరాలు, నిర్ణయాలుసహా కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల సమాచారం మొత్తం పత్రాల రూపంలోనే అందిస్తూ వచ్చారు. కానీ కరోనాతో ఈ సంప్రదాయానికి బ్రేకులు పడ్డైట్లెంది.
* ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,584.58 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.711.17 కోట్లతో పోలిస్తే రెండు రెట్లు అధికం. నిర్వహణ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 17.38% పెరిగి రూ.12,254.12 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. అంతక్రితం ఇది రూ. 10,439.34 కోట్లుగా ఉన్నది. నిర్వహణ ఖర్చులు 10,190 కోట్ల నుంచి 9,611 కోట్లకు తగ్గడం లాభాల్లో భారీ వృద్ధికి పరోక్షంగా దోహదం చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 22.82 మిలియన్ టన్నుల సిమెంట్‌ను విక్రయించింది సంస్థ. కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే వృద్ధి బాటపడుతుండటంతో పాటు గ్రామీణ, పట్టణాల్లో గృహాల నిర్మాణాలు ఊపందుకోవడంతో సిమెంట్‌కు గిరాకీ పెరిగిందని పేర్కొంది.
* ఫేస్బుక్ యూజర్లు తమ ప్రమేయం లేకుండానే అకౌంట్ నుంచి లాగౌట్ అయ్యినట్లు చాలా మంది యూజర్లు శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తాము లాగౌట్ చేయకపోయిన ఫేస్బుక్ నుంచి ఆటోమేటిక్ గా లాగౌట్ అయ్యినట్లు కొందరు ఫేస్బుక్ కు పిర్యాదు చేసారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నం అయ్యింది. అయితే ఈ విషయంపై ఫేస్బుక్ స్పందించింది. “జనవరి 22న కాన్ఫిగరేషన్ మార్పు వలన కొంతమంది వారి ఫేస్బుక్ ఖాతాల నుంచి లాగౌట్ అయ్యారు. మేము ఈ సమస్యను కనుగొని పరిష్కరించాము, ఈ అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి” అని ఫేస్బుక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లాగ్-అవుట్ సమస్యకు ఐఫోన్ ఫేస్బుక్ వినియోగదారులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. లాగౌట్ అయిన తర్వాత తిరిగి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు టూ-స్టెప్-వెరిఫికేషన్ వల్ల అథెంటికేషన్ కోడ్స్ వారి మొబైళ్లకు రావడానికి చాలా సమయం పట్టింది అని యూజర్లు వాపోయారు.
* దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ‘ఎల్జీ’ మొబైల్ ఫోన్ మార్కెట్ నుంచి వైదొలగవచ్చనే ఊహగానాల మధ్య భారతదేశంలో ఎల్జీ కె42 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఎల్జీ కె42 తన ఆధిక ఉష్ణోగ్రత, తక్కువ ఉష్ణోగ్రత, ఉష్ణోగ్రత షాక్, వైబ్రేషన్ వంటి తొమ్మిది పరీక్షల్లో యుఎస్ మిలిటరీ డిఫెన్స్ స్టాండర్డ్ అందుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఎల్జీ కె42 అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ MIL-STD-810G సర్టిఫైడ్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ జనవరి 26 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభిస్తుంది. దీని ధర 10,990 రూపాయలు.