ScienceAndTech

ఆన్‌లైన్‌లో భారత ఓటర్ కార్డు

ఆన్‌లైన్‌లో భారత ఓటర్ కార్డు

ఓటరు ఐడీలను ఇకపై మొబైల్‌/ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్‌ వెర్షన్‌ ఓటరు గుర్తింపు కార్డులు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ ఓటర్ల దినోత్సవం (జనవరి 25) సందర్భంగా సోమవారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వీటిని ఆవిష్కరించనున్నారు. ఈ డిజిటల్‌ ఓటరు గుర్తింపు కార్డును డిజిలాకర్‌లో పొందుపరచుకోవచ్చు. అలాగే పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో ప్రింట్‌ చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అధికార వర్గాలు తెలిపాయి. రేపటి కార్యక్రమంలో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న ఐదుగురికి డిజిటల్‌ కార్డులను మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అందజేస్తారని ఈసీ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపింది. ఓటరు ఐడీ కార్డును సత్వరమే ప్రజలకు అందించే విధంగా ఈ గుర్తింపు కార్డును తీసుకొస్తున్నారు. ఇకపై మీ-సేవ కేంద్రాలకు వెళ్లి ఓటరు కార్డు తీసుకునే అవసరం ఉండదు. ఇప్పటికే ఆధార్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటివి డిజిటల్‌ మోడల్‌లో అందుబాటులో ఉండగా.. ఆ జాబితాలో ఓటరు గుర్తింపు కూడా చేరుతుండడం గమనార్హం.