Editorials

మైనర్ల దుస్తులుపై తాకితే లైంగిక వేధింపు కాదు

మైనర్ల దుస్తులుపై తాకితే లైంగిక వేధింపు కాదు

లైంగిక వేధింపులకు సంబంధించి బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు చర్చను రేకెత్తిస్తోంది. ‘పోక్సో’ చట్టం(లైంగిక వేధింపుల నుంచి చిన్నారుల్ని రక్షించడానికి ఉద్దేశించిన చట్టం) ప్రకారం.. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఓ బాలిక వక్షస్థలాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని విశదీకరిస్తోందని వ్యాఖ్యానించింది. లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని పేర్కొంది. 12 ఏళ్ల బాలికపై 39 ఏళ్ల ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నమోదైన కేసు విచారణ సందర్భంగా.. నాగ్‌పుర్‌ బెంచ్‌కు చెందిన మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప గనేడివాలాతో కూడిన ఏక సభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పునిచ్చింది. ఆ కేసులో నిందితుడికి పోక్సో చట్టంలోని సెక్షన్‌ 8(చిన్నారులపై లైంగిక దాడి) కింద మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అయితే నిందితుడికి ఐపీసీ సెక్షన్‌ 354(ఓ మహిళ గౌరవానికి భంగం కలిగించడం), సెక్షన్‌ 342(దురుద్దేశంతో నిర్బంధించడం) కింద దిగువ కోర్టు విధించిన ఒక ఏడాది కఠిన కారాగార శిక్షను మాత్రం సమర్థించింది.

2016లో సతీష్‌ అనే వ్యక్తి బాధిత బాలికకు పండు ఇస్తానని ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక ఛాతీని తాకి ఆమె దుస్తులు విప్పడానికి యత్నించాడు. ఆ బాలిక కేకలు వేయడంతో తల్లి అక్కడికి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా దిగువ కోర్టు నిందితుణ్ని పోక్సో చట్టం కింద దోషిగా తేలుస్తూ పైన పేర్కొన్న శిక్షలు విధించింది. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు వెలువరించింది. ‘‘పోక్సో చట్టం ప్రకారం విధించే కఠిన శిక్షల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నిందితుల నేరాన్ని నిరూపించడానికి గట్టి సాక్ష్యాలు, వారిపై తీవ్రమైన ఆరోపణలు ఉండాల్సిన అవసరం ఉందని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది. ఈ కేసులో నిందితుడు బాలిక వక్షస్థలాన్ని తాకేందుకు ఆమె దుస్తులు తొలగించాడా లేదా దుస్తుల లోపలికి చేయి పెట్టాడా అన్న నిర్దిష్టమైన వివరాలు లేవు. కాబట్టి దీన్ని లైంగిక వేధింపుల కింద పరిగణించలేం’’ అని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.