* దేశంలో పలు పాత కరెన్సీ నోట్లు రద్దు చేస్తారంటూ వస్తోన్న వార్తలపై రిజర్వు బ్యాంకు స్పందించింది. అలాంటి వార్తలను కొట్టిపారేస్తూ ట్వీట్ చేసింది. దేశంలో రూ.100, రూ.10, రూ.5 సిరీస్ కరెన్సీ నోట్లు చలామణిలోనే ఉంటాయని స్పష్టంచేసింది. ఈ మూడు రకాల పాత నోట్లను భవిష్యత్తులోనూ ఉపసంహరించుకోబోమని తెలిపింది.
* ఎల్‌ఐసీ, బీపీసీఎల్… ఇలా ప్రతి బడ్జెట్‌లో ఏదో ఒక దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థలో వాటాల విక్రయం ప్రణాళిక ఉండటం ఆనవాయితీగా మారిపోయింది. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పుడల్లా ఈ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం చేపడుతుంది. ఏది ఏమైనా నాణ్యమైన సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసే అవకాశం ప్రజలకు లభిస్తుంటుంది. ఈ సంస్థలకు ప్రభుత్వం అండదండలు ఉండటం.. కీలకమైన ప్రాజెక్టులు చేతిలో ఉండంతో ప్రజలు బలంగా వీటిని విశ్వసిస్తారు. దీనికి ప్రభుత్వం కూడా ఏటా పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యాన్ని పెంచుకొంటూ పోతోంది. ప్రస్తుత సంవత్సరంలో అత్యధికంగా రూ.2.1లక్షల కోట్లను లక్ష్యంగా నిర్దేశించుకొంది. దీని ప్రకారం ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాలు ప్రజలకు, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు లేదా ప్రైవేటు, ప్రభుత్వ రంగ కంపెనీలకు విక్రయించాలి.
* కరోనా సంక్షోభం మూలంగా ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారీగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. భారత్, చైనా మాత్రం అందుకు మినహాయింపని ఓ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లోకి ఎఫ్‌డీఐలు అత్యంత కనిష్ఠ స్థాయికి చేరినట్లు తెలిపింది. మరోవైపు 2020లో భారత్‌కు వచ్చిన ఎఫ్‌డీఐలలో 13 శాతం వృద్ధి నమోదైనట్లు ‘యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్(యూఎన్‌సీటీఏడీ)’ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా డిజిటల్ సెక్టార్, ఇన్ఫర్మేషన్ కన్సలింగ్, ఈ-కామర్స్, డేటా ప్రాసెసింగ్, డిజిటల్ పేమెంట్స్ రంగాల్లోకి పెట్టుబడులు భారీగా వచ్చినట్లు తెలిపింది. అలాగే భారత్‌లోకి సీమాంతర కొనుగోళ్లు – విలీనం(ఎంఅండ్‌ఏ) ద్వారా వచ్చిన పెట్టుబడులు 83 శాతం పెరిగినట్లు పేర్కొంది. రిలయన్స్ జియో ప్లామ్ ఫామ్స్‌లో ఫేస్‌బుక్ 9.9 శాతం వాటాల కొనుగోలు సహా ఇంధన రంగంలోని మరికొన్ని కంపెనీలతో కుదిరిన ఒప్పందాలతో ఎంఅండ్‌ఏ ఆదాయం గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది.
* రియల్ ఎస్టేట్ రంగానికి 2020 ఓ పీడకల. కొన్ని నెలల పాటు ప్రాజెక్టులు ఆగిపోవడం.. కూలీల కొరత.. ముడిసరుకుల కొరత.. పెరిగిపోతున్న వడ్డీలు ఇలా స్థిరాస్థి రంగం ముప్పేట దాడికి గురైంది. ఫలితంగా చాలా ప్రాజెక్టులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. మరోపక్క భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోవడం కూడా స్థిరాస్తి రంగంపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఇళ్లకు భారీగా డిమాండ్ తగ్గింది. ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
* ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో అందుకు అనుగుణంగా కీలక ప్రకటనలు చేసేందుకు సిద్ధమవుతోంది. దేశీయంగా తయారీ, ఎగుమతులకు ఊతమిచ్చేలా కొన్ని రకాల ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని ఎత్తివేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఫర్నీచర్ తయారీలో ఉపయోగించే చెక్క, స్వాన్ ఉడ్, హార్డ్ బోర్డ్ లాంటి ముడిపదార్థాలతో పాటు రాగి ఉత్పత్తులకు ఉపయోగించే ముడిసరుకులపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది.