Politics

“భారతరత్న”కు పద్మవిభూషణం

“భారతరత్న”కు పద్మవిభూషణం

పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘పద్మ’ అవార్డుల జాబితాను సోమవారం రాత్రి విడుదల చేసింది. 2021 సంవత్సరానికి గాను ఏడుగురికి పద్మవిభూషణ్‌, 10 మందికి పద్మభూషణ్‌, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. గానగంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని పద్మవిభూషణ్‌తో కేంద్రం గౌరవించింది. పద్మవిభూషణ్‌కు ఎంపికైన వారిలో జాబితాలో జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే, వైద్యరంగంలో సేవలందించిన డాక్టర్‌ బెల్లె మోనప్ప హెగ్డే (కర్ణాటక), సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో కర్ణాటకకు చెందిన నరీందర్‌సింగ్‌ కపనే (మరణానంతరం- అమెరికా), మౌలానా వహిదుద్దీన్‌ఖాన్‌ (దిల్లీ), బీబీ లాల్‌ (దిల్లీ), సుదర్శన్‌ సాహూ (ఒడిశా) ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి నలుగురిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. వీరిలో ఏపీకి చెందినవారు ముగ్గురు ఉండగా.. తెలంగాణ నుంచి ఒక్కరు ఉన్నారు. ఏపీ నుంచి రామస్వామి అన్నవరపు (కళారంగం), ప్రకాశ్‌రావు అసవడి (సాహిత్యం, విద్య), నిడుమోలు సుమతి (కళలు) ఉండగా.. తెలంగాణకు చెందిన కనకరాజుకు కళా రంగంలో పద్మశ్రీ దక్కింది.