Fashion

ముక్కెర అందం…

ముక్కెర అందం…

నాసాగ్రే నవ వౌక్తికం అని శ్రీకృష్ణుని అందాన్ని వర్ణిస్తూ ఏనాడో చెప్పారు. ముక్కుపుడకను ధరించే సంప్రదాయం హిందూమతంలో అనాదిగా ఉంది. భారతీయ సంస్కృతిలో హిందూ మతం ప్రకారం ఆడవారికి ముక్కు, చెవులు కుట్టడం అనేది ఒక ప్రత్యేకమైన ఆచారంగా ఉంది. అలాగే ఇంకొన్ని వర్గాల తరఫున మగవారు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తుంటారు. మన సంప్రదాయంలో ముక్కుపుడకలకు ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో ప్రాంతాన్ని బట్టి ముక్కుపుడక ధరించే పద్ధతి వేరుగా ఉంటుంది. ముక్కుపుడకలు ధరించడం వల్ల వారికి అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, దేశంలోని తూర్పు మధ్య ప్రాంతంలో ఉన్నవారు చాలా గట్టిగా నమ్ముతారు. ముక్కుపుడకను కొన్ని రకాల లోహాలతో చేయడం వల్ల అది చెడును శోషించుకుని గాలిని స్వచ్ఛంగా మార్చి ధరించిన వాళ్లని అనారోగ్యానికి దూరంగా ఉంచుతుందని చెబుతుంటారు. కానీ శాస్తప్రరంగా చూస్తే మాత్రం ఇది ఒక మూఢనమ్మకంగా ఉంటుంది. ముక్కు కుట్టడం గురించి కథనాలు ఎలా ఉన్నా, మహిళలు ముక్కు పుడక పెట్టుకోవడం అనేది మాత్రం ముఖ్యమైన ఆచారంగా చెబుతారు. ఈ ముక్కుపుడక సంప్రదాయం కేవలం హిందూమతంలోనే కాకుండా ఇతర మతాల మహిళల్లో కూడా కనబడుతుంది. మతపరంగా ముక్కుపుడకను వివాహ దృష్ట్యా పార్వతీదేవి గౌరవ సూచకంగా చూస్తారు. సాధారణంగా ముక్కుపుడక ధరించడమనేది హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ సూచికగా కనిపిస్తుంది. పదహారేళ్ల వయస్సులో అమ్మాయిలు ముక్కుపుడక ధరించడం అనేది పెళ్లికి సిద్ధమని చెబుతుంది. సంప్రదాయం ప్రకారం భర్త మరణంతోనే ముక్కుపుడక తొలగించబడుతుంది. సాధారణంగా 5, 7, 11 సంవత్సరాల్లో ఆడపిల్లలకు ముక్కు కుట్టిస్తారు. లేదా వివాహానికి సంసిద్ధమైన ఆడపిల్లకు ముక్కు కుట్టిస్తారు. వివాహ సమయానికి ఆడపిల్ల ముక్కుకి పుడక తప్పనిసరిగా ఉండాలని ఇప్పటికీ చాలా కుటుంబాల్లో భావిస్తారు. చిన్న వయస్సులో ముక్కు కుట్టించడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముక్కుకి ఎడమవైపున చంద్రనాడి ఉంటుంది. కాబట్టి ముక్కుకి ఎడమవైపు అర్ధచంద్రాకారంలో బేసరిని ధరించాలి. ముక్కు కుడివైపున సూర్యనాడి ఉంటుంది. కుడివైపున మండలాకారమైన ఒంటిరాయి బేసరిని ధరించాలని శాస్త్రోక్తం. ముక్కుకి మధ్యలో ముక్కెరను ధరించాలి. ఇవి సాధారణంగా ముత్యం లేదా కెంపుని బంగారంతో చుట్టించి ధరిస్తారు. ఆయుర్వేదం ప్రకారం ముక్కు భాగంలోని నరాలను శాంత పరచడానికి మహిళలు ముక్కుపుడకలు ధరిస్తారని చెబుతారు. మహిళలు ప్రసవించే సమయంలో పురిటినొప్పులు ఎక్కువగా లేకుండా సుఖప్రసవం కావడానికి ముక్కుపుడక సహాయపడుతుందని పెద్దలు చెబుతుంటారు. ముక్కు కుట్టడం ద్వారా మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుందనే విషయాన్ని కూడా బామ్మలు చెబుతుంటారు. ఎడమవైపు ముక్కు పుడక ధరించడం వల్ల ఆడవారికి గర్భకోశవ్యాధులు తగ్గుతాయి. అంతేకాదు కంటి, చెవినరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముక్కు కుట్టించుకోవడం వల్ల చెవిపోటు వంటివి దరిచేరవు. నేడు ముక్కుపుడక అనేది కేవలం ఆచారంగానే కాకుండా ఫ్యాషన్‌గా కూడా మారిపోయింది. వివిధ రకాల మోడల్స్‌లో లభ్యమవుతోన్న ముక్కుపుడకలు మహిళల అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. అంతేకాదు ఇవి అతి తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటున్నాయి. కేవలం ఫ్యాషన్ కోసమే అయితే ముక్కు కుట్టించుకోవాల్సిన అవసరం లేదంటోంది నేటి యువత. ముక్కును కుట్టకుండానే ధరించే పుడకలు ఎన్నో అందుబాటులోకి వచ్చేశాయి. ఇకెందుకాలస్యం.. వెంటనే ముక్కు కుట్టించేసుకోండి.. దీనివల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం.. అందానికి అందం.. ఫ్యాషన్‌కు ఫ్యాషన్.. కేవలం అందం, ఫ్యాషన్ కావాలంటే మాత్రం ముక్కు కుట్టించుకోకున్నా పుడక పెట్టేస్తే సరి!