ఒక అడవిలో ఒక ఎలుగుబంటి వుండేది. దానికి ఒంటినిండా వెండ్రుకలు వుండేవి. ఆ వెండ్రుకలంటే ఎలుగుబంటికి చాలా అసహ్యం.
నీళ్ళలో తన రూపాన్ని చూసుకుంటూ చాలా బాధపడేది.
ఎలుగుబంటి అడవిలోని రకరకాల రంగురంగుల పక్షులను, జంతువులను చూసేది.
అబ్బ నాకు కూడా ఒళ్ళంతా వెండ్రుకలు లేకుండా ఇలా రంగులుంటే ఎంత బాగుండు అనుకునేది.
నీటిలో ఈదే రంగురంగుల చేపలను చూసి తెగ బాధపడేది.
కొంత కాలానికి చలికాలం వచ్చింది. పక్షులు ఆ చలికి తట్టుకోలేక పోతున్నాయి. ఆహారం కోసం బైటికి రాలేక ఆకలికి బాధ పడుతా గూళ్ళలోనే వణుకుతూ కూర్చున్నాయి. జంతువులు ఆ చలికి బైట తిరగడం మానేశాయి.
నీళ్లు గడ్డకట్టి చేపలు చనిపోసాగాయి.
ఎలుగుబంటి మాత్రం హాయిగా తిరుగుతూవుంది. దానికి కొంచం గూడా చలివేయడం లేదు.
ఒక కుందేలు అది చూసి వణుక్కుంటా “ఎలుగుమామా! నీదే హాయి. నీ ఒంటినిండా దట్టమైన వెండ్రుకలున్నాయి కొంచంగూడా చలి వెయ్యకుండా. చూడు మేమంతా ఎలా వణికిపోతున్నామో, మాకు కూడా ఈ పనికిరాని రంగుల బదులు నీలాగా వెండ్రుకలు వుంటే ఎంత బాగుండేదో” అంది.
ఆ మాటలకు ఎలుగుబంటి “నిజమే! ఈ వెండ్రుకల వల్లనే గదా నేను ఈ చలికి తట్టుకోగలుగుతున్నాను. హాయిగా తిరగ గలుగుతున్నాను. కడుపునిండా తినగలుగు తున్నాను” అనుకొంది. తనకు ఈ రూపం ఇచ్చినందుకు ఆ దేవునికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకొంది
కనువిప్పు-తెలుగు చిన్నారుల కథ
Related tags :