అవంతికా ఆలయానికి వెళ్లొస్తా.. నేను కాళికను.. అంటూ కన్నబిడ్డల హత్య కేసులో నిందితురాలు పద్మజ కేకలేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. మదనపల్లె శివనగర్‌లో ఆదివారం జరిగిన అలేఖ్య, సాయిదివ్య హత్య కేసుల్లో నిందితులైన వారి తల్లిదండ్రులను అరెస్టు చేసేందుకు రూరల్ పోలీసులు మంగళవారం పురుషోత్తంనాయుడు ఇంటి వద్దకు వెళ్లారు. భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని వాహనంలో స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో పద్మజ చేతులు తిప్పుతూ ‘నేనే శివ’ అంటూ బిగ్గరగా అరిచారు. స్టేషన్‌లోనూ ఆమె కేకలేశారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భార్యాభర్తలను పోలీసులు వైద్యపరీక్షలకు తీసుకెళ్లారు. అక్కడ ఆమె అరవడంతో భర్త పురుషోత్తంనాయుడు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా ఆయన్ను తన భర్తే కాదని తాను శివుడినని పక్కకు తోసేసింది. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
నిందితుల ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల నుంచి ఏడు రోజుల ఫుటేజీని సేకరించామని మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి విలేకర్లకు తెలిపారు. పిల్లలు ఏవిధంగా హత్యకు గురయ్యారన్న విషయాలు పోస్టుమార్టం, క్లూస్‌టీం నివేదిక ఆధారంగా తేలనున్నాయన్నారు. వీరి ఇంట్లో హత్యకు ముందు రెండు రోజుల క్రితం ఓ మంత్రగాడు వచ్చి పూజలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై కూడా పూర్తి విచారణ చేస్తామన్నారు. సకాలంలో తమ సిబ్బంది వెళ్లకుంటే కుమార్తెలతో పాటు తల్లిదండ్రులూ మృతి చెందేవారని పేర్కొన్నారు. దెయ్యాలు ఉన్నాయన్న అపనమ్మకం, తమ ఇంట్లో ధైవభక్తితో అద్భుతాలు జరుగుతున్నాయని, తమ కుమార్తెలు చనిపోయినా మళ్లీ బతికి వస్తారని మూఢవిశ్వాసంతో చంపేసినట్లు తమ విచారణలో తెలిసిందన్నారు. నిందితులను తాము విచారణ నిర్వహించే సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాకు లీక్ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నామని, ఓ చరవాణిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పద్మజ, పురుషోత్తంనాయుడుల మానసిక పరిస్థితి సక్రమంగా లేదని గుర్తించానని ప్రభుత్వాసుపత్రి మానసిక వైద్యురాలు రాధిక అన్నారు. ఆమె విలేకర్లతో మాట్లాడుతూ వారిద్దరూ ఆధ్యాత్మికతను మించిన ట్రాన్స్‌లో ఉన్నారని, వారికి ఇప్పుడే చికిత్స అందించి కౌన్సెలింగ్ ఇస్తే కోలుకునే అవకాశం ఉందన్నారు.