ScienceAndTech

జగనన్న కాలనీ ఇళ్లకు ఇంటర్నెట్

Jagan Govt To Arrange Internet For YS Jagananna Colony Homes Of The Poor

పేదలకు నిర్మించి ఇస్తున్న వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కాలనీల్లో చేపట్టనున్న నిర్మాణాల్లో ఏకరూపత, నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డంపింగ్‌ యార్డుల్లో వ్యర్థాల నిర్వహణకు బయోమైనింగ్‌ విధానాన్ని అనుసరించాలని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇళ్ల పట్టాల పంపిణీ నిరంతర కార్యక్రమం. ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడికి 90 రోజుల్లోగా పట్టా అందించాలి. ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలి’ అని ఆదేశించారు. ఇప్పటికే ఎంపిక చేసిన 30.06 లక్షల మంది లబ్ధిదారులకుగానూ 26.21 లక్షల మందికి ఇళ్ల పట్టాలను అందించినట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. 87.17% మేర పంపిణీ పూర్తయిందని, 90.28% కాలనీల్లో పట్టాల పంపిణీ పూర్తి చేసినట్లు వెల్లడించారు. మిగతా పట్టాలను రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలనీల్లో ఏర్పాటు చేయనున్న మౌలిక సదుపాయాలకు సంబంధించి మార్చి 31 నాటికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు చెప్పారు. జనాభా ప్రాతిపదికగా అంగన్‌వాడీ కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ క్లినిక్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, బస్టాప్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.