Politics

ఏకగ్రీవాలపై ఏకరువు పెట్టిన చంద్రబాబు

ఏకగ్రీవాలపై ఏకరువు పెట్టిన చంద్రబాబు

పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలకు వైకాపా నాయకులు ప్రయత్నిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ‘ఏకగ్రీవాల్ని తెదేపా వ్యతిరేకిస్తోందని మంత్రులు, వైకాపా నాయకులు అనడం హాస్యాస్పదం. వాళ్లు చేస్తున్న బలవంతపు ఏకగ్రీవాల్ని మేం స్వాగతించాలా? కచ్చితంగా అడ్డుకుంటాం’ అని స్పష్టం చేశారు. గురువారం తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రలోభాలు, బెదిరింపులు, కిడ్నాప్‌లు, అక్రమంగా నామినేషన్ల తిరస్కరణ, నామినేషన్‌ పత్రాలు లాక్కుని చించేయడం లాంటి అరాచకాలతో 2,374 స్థానాల్లో వైకాపా ఏకగ్రీవాలు చేసుకుందని మండిపడ్డారు. ‘కడప జిల్లాలో 2014 ఎంపీటీసీ ఎన్నికల్లో 14 స్థానాలు ఏకగ్రీవమైతే వైకాపాకి 8 వచ్చాయి. అదే 2020లో ఏకంగా 428 ఏకగ్రీవాలు జరిగాయి. వైకాపాకు 396 వచ్చాయి. ఎందుకలా? ఇప్పుడున్న శక్తి మీకు ఆ రోజు లేదా? ఇప్పుడు పోలీసుల్ని అడ్డుపెట్టుకుని అధికారం అండతో బలవంతపు ఏకగ్రీవాలు చేశారే తప్ప ప్రజామోదంతో కాదు. మీరంతా ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంటే మేం మౌనంగా ఉండాలా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై రాష్ట్ర ఎన్నికల కమిషనరు చర్య తీసుకుంటే… ఆయన పదవీ విరమణ చేశాక మళ్లీ అధికారులకు న్యాయం చేస్తామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి చెబుతున్నారు. ఆయనకు మంత్రిగా ఉండే అర్హత లేదు. వెంటనే తొలగించాలి’ అని డిమాండు చేశారు. గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెదేపా నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులు, నామినేషన్ల దాఖలు సమయంలో చోటుచేసుకున్న దౌర్జన్యాలకు సంబంధించి పలు వీడియోలను సమావేశంలో ప్రదర్శించారు. ‘పల్లె ప్రగతి నాడు-నేడు’ పేరుతో రూపొందించిన నివేదికను విడుదల చేశారు. 2014, 2020 సంవత్సరాల్లో జిల్లాల వారీగా ఏకగ్రీవాల వివరాలను దానిలో పొందుపరిచారు.