Sports

ఓటమి బాటలోనే సింధు

ఓటమి బాటలోనే సింధు

భారత స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌ల వైఫల్యం కొనసాగుతోంది. కరోనా మహమ్మారి కారణంగా 10 నెలల సుదీర్ఘ విరామానంతరం అంతర్జాతీయ స్థాయిలో బరిలో దిగిన వీరు వరుసగా మూడో టోర్నీలోనూ నిరాశ పరిచారు. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లోనూ తేలిపోయారు. వరుసగా రెండు ఓటములతో సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించారు. టోర్నీలో వీరిద్దరు ఇక నామమాత్రమైన మ్యాచ్‌ ఆడనున్నారు. సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సింధు పరాజయంపాలైంది. గురువారం మహిళల సింగిల్స్‌ పోరులో ప్రపంచ ఛాంపియన్‌ సింధు 18-21, 13-21తో ఇంతానన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడింది. 43 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు పూర్తిగా తేలిపోయింది. ఇటీవలే టొయొటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో సింధును ఓడించిన రచనోక్‌ అదే జోరు కొనసాగించింది. నిజానికి తొలి గేమ్‌ను సింధు సానుకూలంగా ప్రారంభించింది. 11-7తో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. 14-10తో మరింత ముందంజ వేసింది. అయితే 14 పాయింట్ల వద్ద సింధును ప్రత్యర్థి అందుకుంది. వరుసగా రెండు స్మాష్‌లతో సింధు 16-14తో ఆధిక్యంలోకి వెళ్లింది. 17 పాయింట్ల వరకు ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. ఈ దశలో సింధు ఒక పాయింటు సాధించి 18-17తో గేమ్‌కు చేరువైంది. అయితే వరుసగా 4 పాయింట్లు గెల్చుకున్న రచనోక్‌.. సింధు ఆశలపై నీళ్లు చల్లింది. రెండో గేమ్‌ ఏకపక్షమైంది. సింధు ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. శుక్రవారం జరిగే చివరి పోరులో పోర్న్‌పావీ (థాయ్‌లాండ్‌)తో సింధు తలపడుతుంది. రెండు విజయాలతో పోర్న్‌పావీ ఇప్పటికే సెమీస్‌ చేరింది. తైజు, రచనోక్‌ మధ్య మ్యాచ్‌ విజేత మరో బెర్తు సాధిస్తుంది.